కేరళలోని మలప్పురం జిల్లాలో తానూర్ సమీపంలోని ఒట్టుంబ్రం నుంచి దాదాపు 40 మందితో వెళ్తున్న పడవ ఆదివారం రాత్రి బోల్తా పడిన సంఘటన సంగతి తెలిసిందే.
కేరళలోని మలప్పురం జిల్లాలో తానూర్ సమీపంలోని ఒట్టుంబ్రం నుంచి దాదాపు 40 మందితో వెళ్తున్న పడవ ఆదివారం రాత్రి బోల్తా పడిన సంఘటన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 22కు చేరింది. మృతుల్లో మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉన్నారు. మరో 8 మందిని రక్షించగా.. వారికి ప్రస్తుతం ఆస్పత్రులలో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సహాయక చర్యల్లో పాల్గొనాల్సిందిగా కేరళ ప్రభుత్వం భారత నావికాదళంను కోరింది.
ఈ నేపథ్యంలో ఇండియన్ నేవి రంగంలోకి దిగింది. ఈ సంఘటన జరిగిన ప్రదేశం కొచ్చి నుంచి దాదాపు 150 కి.మీల దూరం ఉంది. కేరళ ప్రభుత్వం నుండి సహాయం కోసం అభ్యర్థన మేరకు.. ఈరోజు సదరన్ నేవల్ కమాండ్ కొచ్చి నుంచి ఎయిర్ క్రూ డైవర్‌తో కూడిన నావల్ హెలికాప్టర్‌ను వెంటనే రంగంలోకి దించారు. తొలుత ఘటనా స్థలంలో ప్రాథమిక ఏరియల్ సర్వే చేపట్టారు. ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్న ఎన్‌డీఆర్‌ఎఫ్, స్థానిక డైవింగ్ బృందంతో కాంటాక్ట్ ఎస్టాబిలిష్ చేసుకున్నాయి.

అదే సమయంలో 15 మంది డైవర్లతో కూడిన మూడు నౌకాదళ డైవింగ్ బృందాలు కొచ్చి నుంచి అవసరమైన అన్ని డైవింగ్ సెట్లు, గేర్లు మరియు సామగ్రిని సమీకరించాయి. బృందం త్వరలో ఘటనా స్థలానికి చేరుకుని స్థానిక డైవింగ్ ఆపరేషన్‌లలో సహాయం చేసే అవకాశం ఉంది. శోధన కార్యకలాపాలను పెంచడానికి విపత్తు నిర్వహణ, రాష్ట్ర అధికారులతో సమన్వయంతో ముందుకు సాగుతుంది.
ఇక, ఈ ప్రమాదంలో 22 మంది మృతిచెందగా.. వారి వివరాలను గుర్తించినట్టుగా జిల్లా అధికారులు తెలిపారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్), ఇండియన్ కోస్ట్ గార్డ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని, గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు చెప్పారు. నేవీ సహాయం కూడా కోరామని తెలిపారు. బోల్తా పడిన పడవలో ఉన్న ప్రయాణికుల సంఖ్య ఇంకా ఖచ్చితంగా తెలియాల్సి ఉందని చెప్పారు. ఘటన స్థలంలో సహాయక చర్యలను మంత్రులు పీఏ మహ్మద్ రియాస్, వి అబ్దురహిమాన్ సమన్వయం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సంతాప దినం ప్రకటించి అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసింది.
