కేరళలోని మలప్పురం జిల్లాలో జరిగిన బోటు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మోదీ సంతాపం తెలిపారు.
కేరళలోని మలప్పురం జిల్లాలో జరిగిన బోటు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మోదీ సంతాపం తెలిపారు. ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్‌ఆర్‌ఎఫ్) నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ‘‘కేరళలోని మలప్పురంలో పడవ ప్రమాదంలో పలవురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాను. మరణించిన వారి కుటుంబాలకు పీఎంఎన్‌ఆర్ఎఫ్ నుంచి నుండి 2 లక్షలు ఎక్స్ గ్రేషియా అందించబడుతుంది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు పీఎంవో ట్విట్టర్‌లో పోస్టు చేసింది.
ఇక, మలప్పురం జిల్లా తానూర్ ప్రాంతంలోని తూవల్తీరం బీచ్ సమీపంలో ఆదివారం పర్యాటకులను తీసుకువెళుతున్న హౌస్‌బోట్ బోల్తా పడింది. రాత్రి 7.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 22కు చేరింది. మృతుల్లో మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉన్నారు. మరో 8 మందిని రక్షించగా.. వారికి ప్రస్తుతం ఆస్పత్రులలో చికిత్స అందిస్తున్నారు. గల్లంతైనవారి కోసం గాలింపు ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ప్రమాదం సమయంలో పడవలో 35కు పైగా ప్రయాణికులు ఉన్నారని చెబుతున్నారు. అయితే దీనిపై అధికార వర్గాలు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
22 మంది మృతిచెందగా.. వారి వివరాలను గుర్తించినట్టుగా జిల్లా అధికారులు తెలిపారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్), ఇండియన్ కోస్ట్ గార్డ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని, గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు చెప్పారు. నేవీ సహాయం కూడా కోరామని తెలిపారు. బోల్తా పడిన పడవలో ఉన్న ప్రయాణికుల సంఖ్య ఇంకా ఖచ్చితంగా తెలియాల్సి ఉందని చెప్పారు. ఘటన స్థలంలో సహాయక చర్యలను మంత్రులు పీఏ మహ్మద్ రియాస్, వి అబ్దురహిమాన్ సమన్వయం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సంతాప దినం ప్రకటించి అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసింది.
