ఈడీ కస్టడీ నుండి ఆరోగ్యశాఖ మంత్రికి కేజ్రీవాల్ ఆదేశాలు:ఏం చెప్పారంటే?..
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ నుండి మరోమంత్రికి ఇవాళ ఆదేశాలు జారీ చేశారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం నాడు ఈడీ కస్టడీ నుండి ఆరోగ్యశాఖ మంత్రికి ఆదేశాలు జారీ చేశారు.న్యూఢిల్లీలోని మొహల్లా క్లినిక్ లలో ఉచిత మందుల కొరత లేకుండా చూడాలని సీఎం ఆదేశించారని ఆరోగ్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ చెప్పారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈ నెల 15వ తేదీన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నెల 28వ తేదీ వరకు అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈడీ కస్టడీలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ తొలుత నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ వాటర్ మినిస్టర్ అతిషిని ఆదేశించారు. తాజాగా ఇవాళ ఆరోగ్య శాఖ మంత్రికి మందుల కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. ఢిల్లీ ప్రజల ఆరోగ్య సంరక్షణపై కేజ్రీవాల్ శ్రద్ద చూపుతున్నారని మంత్రి భరద్వాజ మంగళవారం నాడు మీడియాకు చెప్పారు.తాను జైలుకు వెళ్లినందున ప్రజలు ఇబ్బందులు పడకూడదనేది సీఎం ఉద్దేశమని మంత్రి తెలిపారు.అన్ని ఆసుపత్రులు, మొహల్లా క్లినిక్ లలో ప్రజలకు ఉచితంగా మందులు, పరీక్షలు అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారని మంత్రి చెప్పారు.
కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ప్రధానమంత్రి నివాసాన్ని ఇవాళ ముట్టడిస్తామని ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ ప్రకటించారు. దీంతో పాటుగా దేశ వ్యాప్తంగా మెగా నిరసన కార్యక్రమాలు చేపడుతామని రాయ్ తెలిపారు.