Asianet News TeluguAsianet News Telugu

మన హక్కులు తిరిగి పొందడానికి రైతుల తరహాలోనే త్యాగాలు అవసరం: ఫరూఖ్ అబ్దుల్లా

కశ్మీరీలు తమ హక్కులు తిరిగి పొందడానికి రైతు ఆందోళనలను ఆదర్శంగా తీసుకోవాలని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు. ఐక్యంగా వెనుకడుగు చూపించకుండా ఎన్నో త్యాగాలు చేసి పోరాడారని రైతు ఆందోళనలను ఆయన ప్రస్తావించారు. కశ్మీరీలు తమ హక్కులు పొందడానికి వారి తరహాలోనే త్యాగాలు చేయాల్సి ఉంటుందని వివరించారు. 370,35ఏ అధికరణాలతోపాటు రాష్ట్ర హోదా తిరిగి ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ఇది వరకు తమకు హామీ ఇచ్చిందనే విషయాన్ని కశ్మీరీలు మరిచిపోవద్దని తెలిపారు. ఇదే సందర్భంగా హైదర్‌పొరాలో జరిగిన ఎన్‌కౌంటర్‌ను గుర్తు చేశారు.
 

kashmiris needed to do sacrifices like farmers says farooq abdullah
Author
Srinagar, First Published Dec 5, 2021, 5:07 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

శ్రీనగర్: Delhi సరిహద్దుల్లో రైతులు ఏడాది కాలంగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. వారి ఆందోళనలకు సుమారు ఏడాది నిండుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మూడు సాగు చట్టాల(Farm Laws)ను రద్దు చేయాలనే వారి డిమాండ్‌ను అంగీకరించనున్నట్టు వెల్లడించింది. వారికి ఇచ్చిన హామీ మేరకు పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలి రోజే ఆ మూడు సాగు చట్టాలను రద్దు చేసే బిల్లును ఉభయ సభల్లోనూ ప్రవేశ పెట్టింది. అదే రోజు ఆ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. కనీస మద్దతు ధర, ఇతర మరికొన్ని డిమాండ్లతో రైతు ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే, మూడు సాగు చట్టాల రద్దు కావడానికి వారు సుమారు ఏడాది పాటు ఆందోళనలు చేయాల్సి వచ్చింది. అలాగే, ఈ పోరాటంలో సుమారు 700 మందికి పైగా రైతులు మరణించారు. రైతుల ఆందోళనలను తాజాగా జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా(Farooq Abdullah) మాట్లాడారు. జమ్ము కశ్మీర్‌(Jammu Kashmir) ప్రజలు కూడా వారి హక్కులను తిరిగి పొందాలంటే అదే తరహా త్యాగాలు చేయాల్సిన అవసరం ఉన్నదని వివరించారు.

నేషనల్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకుడు షేక్ మహమ్మద్ అబ్దుల్లా 116వ జయంతి సందర్భంగా ఆయన సమాధి దగ్గర పార్టీ యువజన విభాగంతో ప్రస్తుత పార్టీ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లాతో మాట్లాడారు. ‘రైతులు సుమారు 11 నెలల పాటు ఆందోళనలు చేశారు. ఇందులో దాదాపు 700 మంది రైతులు ప్రాణ త్యాగం చేశారు. దీంతో మూడు సాగు చట్టాలను రద్దు చేయక తప్పనిపరిస్థితికి కేంద్ర ప్రభుత్వం చేరుకుంది. మనం కూడా మన హక్కులు పొందడానికి ఇలాంటి త్యాగాలు చేయాల్సి ఉన్నది’ అని అన్నారు. ‘మరొక విషయాన్ని గుర్తుంచకోండి. మనకు ఆర్టికల్ 370, 35ఏ, రాష్ట్ర హోదాలు తిరిగి ఇస్తామన్న హామీలు మనకు ఇచ్చారు’ అని గుర్తు చేశారు. ‘అందుకోసం మనం ఏ త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం’ అని తెలిపారు. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చే 370, 35ఏ అధికరణలను కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5న పార్లమెంటులో రద్దు చేసిన సంగతి తెలిసిందే.

Also Read: పాకిస్తాన్‌తో చర్చలే దానికి పరిష్కారం.. జమ్ము కశ్మీర్ మాజీ సీఎం

ఇదే ప్రసంగంలో ఆయన కొన్ని విషయాలపైనా స్పష్టత ఇచ్చారు. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ సౌభ్రాతృత్వానికి వ్యతిరేకం కాదని అన్నారు. అలాగే, హింసనూ ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించదని వివరించారు.

ఇటీవలే జమ్ము కశ్మీర్‌లోని హైదర్‌పొరాలో జరిగిన ఎన్‌కౌంటర్‌నూ ఆయన ప్రస్తావించారు. ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య హైదర్‌పొరాలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో కాల్పుల్లో చిక్కుకుని ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, వారి మృతదేహాలను పోలీసులు వారి కుటుంబ సభ్యులకు ఇవ్వలేదు. ఆ ఇద్దరు కూడా ఉగ్రవాదులకు సహాయం చేశారనే ఆరోపణలు చేశారు. అయితే, ఆ ఆరోపణలను ఖండిస్తూ వారి కుటుంబీకులు ధర్నా చేశారు. తమ బంధువుల మృతదేహాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించింది.

Also Read: జమ్మూకాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ నిధుల గోల్‌మాల్: ఫరూక్ అబ్దుల్లాకు ఈడీ సమన్లు

‘హైదర్‌పొరా ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు పౌరులు మరణించారు. ప్రజలు వారి గళాలను ఎత్తగానే ప్రభుత్వం వారి మృతదేహాలను తిరిగి ఇచ్చేసింది. ఇది కేవలం ఐక్య పోరాటం ద్వారానే సాధ్యం’ అని ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు. అయితే, మరొకరి డెడ్ బాడీని వారి కుటుంబీకులకు ఇవ్వలేదని, ఆ మృతదేహాన్ని కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios