పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన తర్వాత, కశ్మీర్ 'కుందేలు అమ్మాయి' రుబీనా ధైర్యానికి ప్రతీకగా నిలిచింది. ఇప్పుడీ ఈ అమ్మాయి గురించే చర్చ నడుస్తోంది. ఇంతకీ ఎవరీ అమ్మాయి.? ఈమె ఏం చేసింది.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..  

బైసరన్ ప్రశాంతమైన పచ్చికభూముల్లో కాల్పులు వినిపించినప్పుడు, వందలాది మంది సందర్శకులు భయంతో వణికిపోయారు. కానీ తన పెంపుడు కుందేలుతో పర్యాటకులకు ఆ ప్రాంత విశేషాలను తెలియజేసే 16 ఏళ్ల రుబీనా అనే గైడ్ మాత్రం ధైర్యంగా నిలబడింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోతున్న పర్యాటకులకు సహాయం చేయడానికి ముందుకొచ్చింది. ఆమె చూపించిన ధైర్యం కశ్మీర్ స్ఫూర్తికి శక్తివంతమైన చిహ్నంగా నిలిచింది. 

మంగళవారం పహల్గాం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న బైసరన్ ఎకో పార్క్‌లో ముష్కరులు చేసిన దాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన విషయం తెలిసిందే. అలాగే 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ భయానక సంఘటనలో రుబీనా కథ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. కుటుంబాన్ని సాకడానికి రుబీనా స్థానికంగా గైడ్ గా పనిచేస్తుంది. ఈ క్రమంలోనే తాజా ఉగ్రదాడుల సమయంలో ఆమె చెన్నైకి చెందిన ఓ కపుల్ తో ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కాల్పులు వినిపించాయి. "మొదట మేము బాణసంచా అనుకున్నాం," అని రుబీనా గుర్తుచేసుకుంది. మీడియాతో మాట్లాడుతోన్న సమయంలోనూ రుబీనా గొంతు వణుకుతోంది. 

Scroll to load tweet…

త‌న‌తో ఉన్న ప‌ర్యాట‌కుల‌కు ఎలాగైనా ర‌క్షించాల‌నే సంక‌ల్పంతో ఉన్న రుబీనా అంత‌టి భ‌యాన‌క‌మైన ప‌రిస్థితుల న‌డుమ కూడా ధైర్యంగా వ్య‌వ‌హ‌రించింది. సంఘ‌ట‌న స్థ‌లం నుంచి కిలోమీట‌ర్ దూరంలో ఉన్న త‌న చిన్న మ‌ట్టి ఇంటికి ప‌ర్యాట‌కుల‌కు తీసుకెళ్లింది రుబీనా. 

రుబీనా తండ్రి గులాం అహ్మద్ అవాన్ ఆ విషాదం గురించి తెలిసి భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. ఇది ప్ర‌ళ‌యం లాంటిది అంటూ వారితో చెప్పుకొచ్చారు. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డందుకు దేవునికి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నామ‌ని అన్నాడు. 

చాలా మందికి, రుబీనా - ఒకప్పుడు నవ్వుతున్న 'కుందేలు అమ్మాయి' - ఇప్పుడు కశ్మీర్ యువత ధైర్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఎవ‌రో తెలియ‌ని వ్య‌క్తుల కోసం త‌న ప్రాణాల‌ను సైతం లెక్క చేయ‌లేదని స్థానికంగా ఉన్న కొంద‌రు చెప్పుకొచ్చారు. 

ముష్క‌రుల దుశ్చ‌ర్య రుబీనా జీవితాన్ని ఒక్క‌సారిగా కుదిపేసింది. అప్ప‌టి వ‌ర‌కు ప‌ర్యాట‌కుల‌తో స‌రాద‌గా నవ్వుతూ గ‌డిపిన రుబీ ఇప్పుడు మూగ‌బోయింది. ఉపాధితో పాటు త‌న సంతోషం కూడా కోల్పోయింద‌ని ఆమె చెప్పుకొచ్చింది. అయితే ప‌ర్యాట‌కులు మ‌ళ్లీ ఈ ప్ర‌దేశానికి తిరిగి రావాల‌ని ఆమె ఆశాభావం వ్య‌క్తం చేసింది.