పరిహారం పెంచిన తర్వాత రైతుల ఆత్మహత్యలు పెరిగాయి: కర్ణాటక మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
కర్ణాటక మంత్రి శివానంద్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకునే రైతు కుటుంబానికి అందించే పరిహారాన్ని పెంచిన తర్వాత రైతు ఆత్మహత్య పెరుగుతున్నాయని కామెంట్ చేశారు.

బెంగళూరు: కర్ణాటక చెరుకు అభివృద్ధి, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ) శాఖ మంత్రి శివానంద్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆత్మహత్యలకు పరిహారాన్ని రూ. 5 లక్షలకు పెంచిన తర్వాత రైతలు ఆత్మహత్యలు గణనీయంగా పెరిగాయని కామెంట్ చేశారు.
2015 తర్వాత ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారాన్ని రూ. 5 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఆ తర్వాత నుంచి రైతు ఆత్మహత్యలు గణనీయంగా పెరిగాయని మంత్రి శివానంద్ పాటిల్ అన్నారు. హవేరి జిల్లాలో నిర్వహించిన ఓ విలేకరుల సమావేశంలో శివానంద్ పాటిల్ మాట్లాడారు. పంట నష్టం లేదా రుణాలు తిరిగి చెల్లించలేక తీవ్ర ఆర్థిక సమస్యలతో రైతు మరణిస్తే.. ఆ రైతు కుటుంబానికి ప్రభుత్వం పరిహారం అందిస్తుందని వివరించారు.
Also Read : Bharat: రెండూ అధికారిక పేర్లే.. రెండూ ఉపయోగించడానికి రాజ్యాంగపరమైన అభ్యంతరమేమీ లేదు: ఎంపీ శశిథరూర్
‘అలాంటి పరిహారం అందించకుంటే వారు ఇతర పనుల కోసం ప్రయత్నిస్తారు. 2015కు ముందు పరిహారం చాలా తక్కువగా ఉండేది. రైతు కుటుంబాలకు సరైన పరిహారం దక్కకపోయేదని, అందుకే రైతు ఆత్మహత్యలు కూడా చాలా తక్కువగా ఉండేది. 2015 తర్వాత మేం పరిహారాన్ని రూ. 5 లక్షలకు పెంచిన తర్వాత రైతు ఆత్మహత్యలు పెరిగాయి. ప్రజలు పరిహారం కోరడం సహజం. కొన్ని సార్లు ఆర్థిక సహకారం కోసం సహజ మరణాలను కూడా ఆత్మహత్యలుగా చిత్రిస్తుంటారు’ అని మంత్రి పాటిల్ తెలిపారు.