Bharat: రెండూ అధికారిక పేర్లే.. రెండూ ఉపయోగించడానికి రాజ్యాంగపరమైన అభ్యంతరమేమీ లేదు: ఎంపీ శశిథరూర్
ఇండియా, భారత్ రెండూ అధికారిక పేర్లేనని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కామెంట్ చేశారు. ఈ రెండింటినీ ఉపయోగించడానికి రాజ్యాంగపరమైన అభ్యంతరాలేమీ లేవని వివరించారు. రెండూ ఉపయోగించడం మంచిదని, అంతేకానీ, ఒక పేరును పూర్తిగా తొలగిస్తామనుకోవడం వెర్రితనమేనని కామెంట్ చేశారు.

న్యూఢిల్లీ: జీ 20 విందు ఆహ్వాన పత్రంపై ఇండియా ప్రెసిడెంట్ అని కాకుండా భారత్ ప్రెసిడెంట్ అని పేర్కొనడం రాజకీయ దుమారానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఇండియా పేరును భారత్‌గా మార్చుతున్నారనే చర్చ మొదలైంది. ఈ చర్చలో తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తన కామెంట్లు చేశారు. ఇండియా, భారత్ రెండు కూడా అధికారిక పేర్లేనని వివరించారు. ఈ రెండు పేర్లనూ వాడటానికి రాజ్యాంగపరమైన అభ్యంతరాలేమీ లేవని స్పష్టం చేశారు. రెండింటినీ వాడటమే మంచిదని, అంతేకానీ, ఇండియా అనే పేరును మొత్తంగా తొలగిస్తామని నిర్ణయం తీసుకోవడం వెర్రితనమే అవుతుందని కామెంట్ చేశారు. ఇండియా పేరుకు గల బ్రాండ్ వ్యాల్యూ అసమానమైనదని వివరించారు.
ఇండియా అనే పేరుపై తొలిగా అభ్యంతరపెట్టింది పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మొహమ్మద్ అలీ జిన్నా అని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తెలిపారు. ఎందుకంటే బ్రిటీష్ పాలన నుంచి భారత్ విడివడి మందడుగు వేయగా.. పాకిస్తాన్ దాని నుంచి వేరుపడిన దేశంగా ఉంటుందని ఇండియా పేరును జిన్నా వ్యతిరేకించారని వివరించారు. సీఏఏ వంటివాటితో బీజేపీ ప్రభుత్వం జిన్నా ఆలోచనలకు మద్దతు ఇస్తున్నదని ఆరోపించారు.
Also Read: జీ 20 సమిట్ కంటే ముందే.. ఆగస్టులోనే ‘‘భారత్’’ను వినియోగించిన కేంద్రం.. !
శశిథరూర్ ఎక్స్‌లో పోస్టు చేస్తూ ఈ విధంగా రాసుకువచ్చారు. ఇండయాను భారత్ అని పిలవడానికి రాజ్యాంగపరమైన అభ్యంతరాలేవీ లేవని తెలిపారు. ఈ రెండు పేర్లు అధికారికమైనవేనని చెప్పారు. కొన్ని శతాబ్దాలుగా ఇండియా పేరుకు బ్రాండ్ వ్యాల్యూను నిర్మించారని, ఇప్పుడు ఆ పేరును పూర్తిగా తొలగించే వెర్రితనానికి కేంద్ర ప్రభుత్వం పాల్పడదని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ఒక పేరును పూర్తిగా తొలగించడానికి బదులు ఈ రెండు పేర్లను వాడటం మంచిదని సూచించారు. ఇండియా అనే పేరు చరిత్రవ్యాప్తంగా పరిమళించిందని, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని వివరించారు.