కర్ణాటక మంత్రి అశ్వత్ నారాయణ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. టిప్పు సుల్తాన్‌ను చంపేసినట్టే సిద్దారామయ్యనూ దెబ్బతీసి పంపించేయాలని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలపై సిద్దారామయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. తనను చంపేయాలని ఆయన రెచ్చగొడుతున్నట్టు ఆరోపించారు. 

బెంగళూరు:కర్ణాటక మంత్రి సీఎన్ అశ్వత్ నారాయణ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. 18వ శతాబ్ది మైసూరు రాజ్య పాలకుడు టిప్పు సుల్తాన్‌ను పేర్కొంటూ సీనియర్ కాంగ్రెస్ లీడర్, శాసనసభలో ప్రతిపక్ష నేత సిద్దారామయ్యపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. టిప్పు సుల్తాన్‌‌కు చేసినట్టు సిద్దారామయ్యను దెబ్బతీయాలని, అతడిని పంపించేయాలని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలపై సిద్దారామయ్య ఫైర్ అయ్యారు. తనను చంపడానికి ఉసిగొల్పుతున్నాడని ఆరోపించారు. వెంటనే మంత్రిని బర్తరఫ్ చేయాలని సీఎం బసవరాజు బొమ్మైకి విజ్ఞప్తి చేశారు.

మినిస్టర్ అశ్వత్ నారాయణ్ ఇటీవలే మాండ్యలో మాట్లాడుతూ సిద్దారామయ్యను టార్గెట్ చేసుకున్నారు. ‘టిప్పు కొడుకు సిద్దారామయ్య వస్తాడు.. మీకు టిప్పు కావాలా? సావర్కర్ కావాలా? టిప్పు సుల్తాన్‌ను మనం ఎక్కడికి పంపించాం? ఉరి గౌడా, నంజే గౌడాలు ఏం చేశారు? అదే రీతిలో సిద్దారామయ్యను దెబ్బతీసి పంపించేయాలి’ అని వ్యాఖ్యలు చేశారు. 

ఓల్డ్ మైసూరు బెల్ట్‌లోని కొన్ని వర్గాలు బ్రిటీష్ వారితో పోరాడుతూ టిప్పు మరణించలేదని, వారిని వొక్కలిగ సారథులు ఉరి గౌడా, నంజే గౌడాలు చంపేశారని భావిస్తారు. 

ఈ వ్యాఖ్యలపై సిద్దారామయ్య తీవ్ర అభ్యంతరం తెలిపారు. ‘టిప్పును చంపేసినట్టే నన్నూ చంపేయాలని ఉన్నత విద్యా శాఖ మంత్రి అశ్వత్ నారాయణ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అశ్వత్ నారాయణ్ మీరు ప్రజలను ఎందుకు రెచ్చగొడుతున్నారు? మీరే ఓ గన్ తీసుకోండి’ అని విమర్శించారు. 

Also Read: మెజార్టీ రాకుంటే బీజేపీ ఎమ్మెల్యేలను కొంటా..: త్రిపురలో ఎన్నికలు జరుగుతుండగానే తిప్రా మోతా చీఫ్ సంచలనం

తనను చంపేయాలని రెచ్చగొట్టినప్పటికీ అతనిపై చర్యలు తీసుకోకపోవడంపై ఆశ్చర్యపడుతున్నట్టు సిద్దారామయ్య పేర్కొన్నారు. సీఎం బొమ్మై, హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర, వారి బలహీన మంత్రివర్గం నిద్రలో ఉన్నట్టు తోస్తున్నదని ట్వీట్ చేశారు. అంతేకాదు, అశ్వత్ నారాయణ్‌తో ఒప్పందంలోనే ఉన్నట్టు అనుమానించారు. గుజరాత్ బీజేపీ కల్చర్‌నూ ఇక్కడ పెంచాలని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. గుజరాత్ అల్లర్ల సమయంలో మౌనం దాల్చినట్టే పీఎం నరేంద్ర మోడీ ఇప్పుడు కూడా సైలెంట్‌గానే ఉంటారా? అని అడిగారు. కర్ణాటకను మరో గుజరాత్‌లా మారడాన్ని కన్నడిగులు ఎంతమాత్రం అంగీకరించరని పేర్కొన్నారు.

కాగా, అశ్వత్ నారాయణ్ సిద్దారామయ్య కామెంట్లపై స్పందించారు. ఎన్నికల ద్వారా ఓడించాలని చెప్పడమే తన ఉద్దేశమని వివరించారు. అంతేకానీ, సిద్దారామయ్యను భౌతికంగా గాయపరచాలని తాను కోరలేదని, ఆ వ్యాఖ్యలను తప్పుగా చిత్రిస్తున్నారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.