త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు ఒకవైపు జరుగుతుండగానే ఎమ్మెల్యేల కొనుగోలు గురించి ప్రద్యోత్ బిక్రమ్ మాణిక్య దేబ్ బర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు . తమకు మెజార్టీ రాకుంటే బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తామని కౌంటర్ ఇచ్చారు. 

గువహతి: ఈశాన్య రాష్ట్రం త్రిపురలో అధికారాన్ని మరోసారి చేజిక్కించుకోవాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. అధికారాన్ని కోల్పోయిన సీపీఎం పార్టీ కూడా కసిగా బరిలో ఉన్నది. అయితే, త్రిపుర రాజవంశస్తుడు ప్రద్యోత్ బిక్రమ్ మాణిక్య దేబ్‌బర్మ ఈ సారి ఎలక్షన్‌లో సంచలనంగా మారారు. ఆయన కొత్త గిరిజిన పార్టీ తిప్రా మోతా 42 స్థానాల్లో పోటీ చేస్తున్నది. త్రిపురలో ఈ రోజు ఒక వైపు అసెంబ్లీ ఎన్నికలు జరుతుండగానే ఎమ్మెల్యే ప్రలోభాలు, కొనుగోళ్ల వ్యవహారాలపై తిప్రా మోతా చీఫ్ దేబ్‌బర్మ రెస్పాండ్ అయ్యారు. తమకు 30 స్థానాలు రాకుంటే బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని భావిస్తున్నట్టు చెప్పి సంచలనంగా మారారు.

తిప్రా మోతా చైర్మన్ ప్రద్యోత్ మాణిక్య దెబ్‌బర్మ మాట్లాడుతూ, రాష్ట్రంలో బీజేపీని సమర్థంగా ఎదుర్కొంటున్న ఏకైక పార్టీ తమదే అని వివరించారు. అంతేకాదు, తమ పార్టీ స్పష్టమైన మెజార్టీ సాధించకపోతే బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు వెల్లడించారు.

ఎన్నికల తర్వాత పొత్తులు, కూటమి, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాల గురించి అతడిని కొందరు విలేకరులు ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ఆయన ‘ఒక వేళ మాకు 30 సీట్ల కంటే తక్కువగా వస్తే నా ప్యాలెస్‌లోని కొంత భాగాన్ని అమ్మాలని అనుకుంటున్నా, అలాగే, 25 నుంచి 30 మంది బీజేపీ ఎమ్మెల్యేలను కొనాలని అనుకుంటున్నా’ అని బాంబ్ వేశారు. 

Also Read: త్రిపుర ఎన్నికల పోలింగ్ కు ముందు బాంబు పేలుడు క‌ల‌క‌లం.. అగర్తలలో క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌

ఈ వ్యాఖ్యలకు సమర్థనగా మాట్లాడుతూ, డబ్బు డబ్బే అని తెలిపారు. మా సభ్యులు మాత్రమే అమ్మకానికి ఉన్నారని మీరంతా ఎందుకు అనుకోవాలి? అని ప్రశ్నించారు. తమ గురించి మాత్రమే ఎందుకు ఇలాంటి ప్రశ్నలు లేవనెత్తుతున్నారు? అని పేర్కొన్నారు. బీజేపీలో ఉన్నవారిని కూడా కొనుగోలు చేయవచ్చు’ అని హెచ్చరించారు.

త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. 60 మంది సభ్యులున్న శాసనసభకు కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. ఈశాన్య-రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్-వామపక్ష కూటమి, ప్రాంతీయ పార్టీ అయిన తిప్ర మోత మధ్య త్రిముఖ పోరు జరుగుతోంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కూడా రాష్ట్రంలో ఎన్నికల అదృష్టాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తోంది.