కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ రావడంపై చురకలంటించారు ప్రధాని నరేంద్ర మోడీ. కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేస్తోందని.. తమ అబద్ధాలు పనిచేయనప్పుడు ప్రచారంలో పాల్గొనని వారిని ఇక్కడికి తీసుకొస్తున్నారంటూ మోడీ పేర్కొన్నారు.
కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు ప్రధాని నరేంద్ర మోడీ . కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నంజన్‌గుడ్‌లో జరిగిన ర్యాలీలో మోడీ ప్రసంగించారు. కాంగ్రెస్ నకిలీ హామీలను ప్రచారం చేస్తోందని.. ఆ పార్టీ పని మొత్తం అబద్ధాల మూట అని ఆయన ఫైర్ అయ్యారు. అందుకే రాజీవ్ గాంధీ హయాంలో కాంగ్రెస్ అతిపెద్ద హామీ మోసంగా మారిందన్నారు. ప్రస్తుతం వందే భారత్ రైళ్లు చూసి భారతీయులు ఆశ్చర్యపోతున్నారని.. ఈ డబ్బు బీజేపీదో, మోడీదో కాదని.. భారతీయులదని ప్రధాని పేర్కొన్నారు.
గ్రాండ్ ఓల్డ్ పార్టీలో దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేయడానికి రాచరిక కుటుంబం ముందుకు వస్తుందని గాంధీ కుటుంబంపై మోడీ వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేలా అంతర్జాతీయ శక్తులను కాంగ్రెస్ రాజ కుటుంబం ప్రోత్సహిస్తుందని మోడీ ఆరోపించారు. తమ అబద్ధాలు పనిచేయనప్పుడు ప్రచారంలో పాల్గొనని వారిని ఇక్కడికి తీసుకొస్తున్నారంటూ పరోక్షంగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో ఓటమి బాధ్యతను ఒకరిపై ఒకరు వేసుకుంటారని మోడీ దుయ్యబట్టారు.
ALso Read: కర్ణాటక సార్వభౌమాధికారమా?.. మిమల్ని మీరు అపహస్యం చేసుకోకండి: సోనియా గాంధీ కామెంట్స్‌పై బీజేపీ ఫైర్
ఈ ఏడాది ప్రారంభంలో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంపై ప్రధాని చురకలంటించారు. నాడు భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో వుందని.. పార్లమెంట్, పత్రిక, న్యాయ వ్యవస్థపై ఆంక్షలు విధిస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. అలాగే ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే తనను విషసర్పంతో పోల్చిన విషయంపైనా మోడీ కౌంటరిచ్చారు. కాంగ్రెస్ తనను దుర్భాషలాడిందని.. తనపై విషం చిమ్మిందని, కానీ నంజన్‌గుడ్ శ్రీకంఠేశ్వరస్వామి తనకు శక్తిని ప్రసాదించారని ప్రధాని పేర్కొన్నారు.
అంతకుముందు బెంగళూరులోని న్యూతిప్పసంద్ర రోడ్డులోని కెంపేగౌడ విగ్రహం నుంచి ట్రినిటీ సర్కిల్ వరకు మోడీ 8 కిలోమీటర్ల మేర రోడ్ షోను నిర్వహించారు. ప్రత్యేకంగా రూపొందించిన వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు ప్రధాని. ఆ వాహనంలో ఆయనతో పాటు రాజ్యసభ సభ్యుడు ,కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, బెంగళూరు సెంట్రల్ ఎంపీ పీసీ మోహన్ వున్నారు.
