Udupi Incident: కాంగ్రెస్ ప్రభుత్వం క్రిమినల్స్‌ను కాపాడుతున్నది: కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ధ్వజం
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమాయక కన్నడిగులను వేధిస్తూ.. క్రిమినల్స్‌ను కాపాడుతున్నదని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక సంతుష్టివాద రాజకీయాలకు తెరలేపిందని అన్నారు.

బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మండిపడ్డారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేక.. సిద్ధరామయ్య ప్రభుత్వం రాష్ట్రంలో సంతుష్టివాద రాజకీయాలకు తెరలేపిందని ఆరోపించారు. ఉడుపిలోని ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. రాజకీయంగానూ దుమారం రేపింది. ఈ ఘటన పై కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందిస్తూ సిద్ధరామయ్య ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
ఉడుపిలోని ఓ ప్రైవేట్ కంటి హాస్పిటల్, నర్సింగ్ హోంలోని టాయిలెట్‌లో ఓ మొబైల్ కెమెరా పెట్టిన ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనను ట్విట్టర్ ద్వారా కార్యకర్త రష్మి సామంత్ హైలైట్ చేశారు. పోలీసులు ఆమెను, ఆమె కుటుంబాన్ని విచారించారు. బాధితులకు అండగా నిలవాల్సిన సిద్ధరామయ్య ప్రభుత్వం నిందితులను కాపాడుతున్నదని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో బీజేపీ ఒక నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని భరోసా ఇచ్చారు.
ఈ అంశాలపై మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం నిందితులను రక్షిస్తున్నదని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ఉడుపి ఘటనను హైలైట్ చేసిన ఆ ట్విట్టర్ యూజర్ కుటుంబాన్ని పోలీసులు ప్రశ్నించడాన్ని ఆయన ఖండించారు. పోలీసులు తీరు ఆమోదయోగ్యం కాదని అన్నారు. అమాయక కన్నడిగులను బాధితులను చేస్తున్నదని, నిందితులను కాపాడుతున్నదని ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
కర్ణాటకను నేరగాళ్లకు స్వర్గధామంగా మారుస్తున్నారని కేంద్రమంత్రి దుయ్యబట్టారు. నేరస్తుల ఆగడాలను రిపోర్ట్ చేస్తున్న కార్యకర్తల గొంతు నులిమే పని చేస్తున్నదని ఆగ్రహించారు. కాంగ్రెస్ బురద రాజకీయాలను కచ్చితంగా బీజేపీ అడ్డుకుని తీరుతుందని వివరించారు.
మైనార్టీ కమ్యూనిటీకి చెందిన ముగ్గురు గర్ల్స్ స్టూడెంట్స్.. టాయిలెట్‌లో స్టూడెంట్లను రహస్యంగా రికార్డ్ చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ వీడియోలను వాట్సాప్ గ్రూప్‌లలో షేర్ చేస్తున్నారని ఆ ఆరోపణలు పేర్కొన్నాయి. కాగా, ఓ యాక్టివిస్ట్ రష్మి సామంత్ ప్రజలను ఈ విషయంపై హెచ్చరించారు. ట్విట్టర్ ద్వారా ప్రజలను జాగృతం చేసింది.
కర్ణాటక పోలీసులు నిందితుల పై యాక్షన్స్ తీసుకోకుండా తనను, తన కుటుంబాన్ని వేధిస్తున్నారని రష్మి సామంత్ పేర్కొన్నారు. తన వ్యాఖ్యలను అణచివేసే పని చేస్తున్నారని వివరించారు. ఈ పరిణామంతో కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదని బీజేపీ ఆరోపించింది కూడా.