కర్ణాటకలో బీజేపీకి దెబ్బ! లంచంతో పట్టుబడ్డ ఎమ్మెల్యే కుమారుడు.. కేఎస్‌డీఎల్ చైర్మన్‌గా తప్పుకున్న ఎమ్మెల్యే
కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే కొడుకు రూ. 40 లక్షలు తీసుకుంటూ కేఎస్‌డీఎల్ ఆఫీసులో అడ్డంగా పట్టుబడటం బీజేపీకి కొత్త తలనొప్పిగా మారిపోయింది. కాంగ్రెస్ అవినీతి ఆరోపణల తీవ్రతను మరింత పెంచింది. రెడ్ హ్యాండెడ్‌గా రూ. 40 లక్షలతో పట్టుబడటం, ఆ తర్వాత వారి ఇంటిలో లోకాయుక్త రైడ్ చేయగా మరో రూ. 6 కోట్ల నగదును రికవరీ చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే కేఎస్‌డీఎల్ చైర్మన్‌గా ఎమ్మెల్యే విరూపాక్షప్ప తప్పుకున్నారు.
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. బీజేపీ టిప్పు సుల్తాన్‌ను ప్రధానంగా చేస్తూ కాంగ్రెస్ పై దాడి చేస్తుండగా.. కాంగ్రెస్ మాత్రం బీజేపీపై అవినీతి అస్త్ర ప్రయోగం చేస్తున్నది. కొన్నాళ్లుగా పేసీఎం, 40 శాతం కమిషన్ సర్కార్ అంటూ కాంగ్రెస్ గట్టిగా ప్రచారం చేసింది. వీటిని అధికార బీజేపీ కొట్టివేస్తూ ప్రతిదాడికి దిగింది. ఇలాంటి పరిస్థితులు ఉన్న కర్ణాటకలో అధికార పార్టీకి షాక్ ఇచ్చే ఘటన జరిగింది. ఎమ్మెల్యే కొడుకు రూ. 40 లక్షల లంచం తీసుకుంటూ లోకాయుక్తా అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అనంతరం, ఆ ఎమ్మెల్యే ఇంట్లో రైడ్ చేయగా.. రూ. 6 కోట్లు కట్టలుగా క్యాష్ కనిపించింది. ఈ ఘటన ఇప్పుడు రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ ఈ ఘటనను తన అస్త్రానికి మరింత బలాన్ని జోడించడానికి ఉపయోగిస్తున్నది. కాగా, ఎమ్మెల్యే కేఎస్‌డీఎల్ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు.
మైసూర్ శాండల్ సోప్ తయారు చేసే ప్రభుత్వ సంస్థ కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (కేఎస్‌డీఎల్) చైర్మన్‌గా బీజేపీ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్పా సేవలు అందించారు. ఆయన కుమారుడు ప్రశాంత్ మాదాల్ బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డులో చీఫ్ అకౌంటెంట్. గురువారం కేఎస్‌డీఎల్ ఆఫీసులో ప్రశాంత్ మాదాల్ రూ. 40 లక్షలు తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. మొత్తంగా కేఎస్‌డీఎల్ ఆఫీసులో రూ. 1.7 కోట్లను సీజ్ చేశారు. ఆ తర్వాత విరూపాక్షప్ప ఇంటిలో రైడ్ చేశారు. అక్కడ రూ. 6 కోట్ల నగదును రికవరీ చేసుకున్నారు.
BJP MLA Madal Virupakshappaఅనంతరం, రాష్ట్రంలో బీజేపీపై అవినీతి ఆరోపణలు పెరిగాయి. ఈ ఆరోపణల తాకిడితో ఎమ్మెల్యే విరూపాక్షప్ప కేఎస్‌డీఎల్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. లోకాయుక్త రైడ్‌తో తనకు సంబంధం లేదని తెలిపారు. తనకు, తన కుటుంబానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర ఇది అని ఆరోపించారు.
లోకాయుక్తా అధికారుల ప్రకారం, ప్రశాంత్ మాదాల్ లంచం తీసుకుంటున్నాడని ఓ వ్యక్తి గురువారం లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. దీంతో లోకాయుక్త అధికారులు ముందుగానే అప్రమత్తమై ప్రశాంత్ మాదాల్‌ను పట్టుకున్నారు. తన తండ్రికి బదులుగా ఆయన స్థానంలో కొడుకు ప్రశాంత్ మాదాల్ ఈ లంచం తీసుకుంటున్నాడని తాము అనుమానిస్తున్నట్టు లోకాయుక్త పేర్కొంది. అయితే, ఆ ఆఫీసులో పట్టుబడ్డ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని పరిశీలిస్తున్నామని వివరించింది.
40 శాతం(కమీషన్) సర్కార్ అవినీతి కంపు సుగంధాన్ని వెదజల్లే మైసూర్ శాండల్ సోప్‌నూ చుట్టేసిందని కాంగ్రెస్ ఫైర్ అయింది. కేఎస్‌డీఎల్ చైర్మన్, బీజేపీ ఎమ్మెల్యే విరూపాక్షప్ప కొడుకు రూ. 40 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడని, ఆ తర్వాత 24 గంటల్లోపలే చేసిన రైడ్‌లో రూ. 6 కోట్లు వారి ఇంటిలో నుంచి రికవరీ చేసుకున్నారని కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా పేర్కొన్నారు. బీజేపీ అంటే భ్రష్ట్ జనతా పార్టీ అని ట్వీట్ చేశారు.