ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వానికి సూచనలు చేశారు ప్రముఖ సినీనటుడు,  మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్. కొంత ఆలస్యమైనా ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించాల్సిందేనని ఆయన కోరారు. రాష్ట్రంలోని విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కమల్ హాసన్ విజ్ఞప్తి చేశారు.

కొవిడ్-19 కారణంగా ఇప్పటికే సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పరీక్షలను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇప్పటికే చాలామంది నిపుణులు విమర్శలు చేస్తున్నారని కమల్ వ్యాఖ్యానించారు. సరైన ప్రణాళికతో పరీక్షలు నిర్వహించడం అనేది మంచి పద్ధతి అనీ.. ప్రొఫెషనల్ కోర్సులు, విదేశీ యూనివర్సిటీల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్‌లో వచ్చిన మార్కులు చాలా కీలకమని కమల్ తెలిపారు.

Also Read:రాజీనామాలతో కుదేలు: ద్రోహి.. నెంబర్ టూపై కమల్ హాసన్ సీరియస్..!

అవసరమైతే సిలబస్‌ను కొంత మేర కుదించి.. పరీక్షలకు ముందే విద్యార్ధులకు సమాచారం ఇవ్వాలని కమల్ సూచించారు. కేరళ ప్రభుత్వం ఇప్పటికే పరీక్షలు నిర్వహించిన విషయాన్ని తమిళనాడు ప్రభుత్వం గమనించాలని ఆయన తెలిపారు. స్టాలిన్ సర్కార్ కేరళను ఆదర్శంగా తీసుకుని విద్యార్ధుల భవిష్యత్తుకు ఎంతో కీలకమైన పరీక్షలను నిర్వహించాలని ఆయన కోరారు.