సనాతన వివాదంపై కమల్ హాసన్ రియాక్షన్.. ‘ఉదయనిధి చిన్న పిల్లాడు కాబట్టి వేధిస్తున్నారు’
తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం పై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా, ఆ వివాదంపై కమల్ హాసన్ స్పందించారు. ఉదయనిధి చిన్నపిల్లవాడు కాబట్టి వారు వేధిస్తున్నారని కామెంట్ చేశారు. నిజానికి సనాతనం అనే పదాన్ని పెద్ద మనిషి పెరియార్ ద్వారా మనకు తెలిసిందని చెప్పారు.

చెన్నై: ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ శుక్రవారం సనాతన ధర్మం వివాదంపై స్పందించారు. తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చిన్న పిల్లవాడు కాబట్టే ఆయనను వేధిస్తున్నారని, వెంటాడుతున్నారని అన్నారు. కానీ, సనాతన అనే పదాన్ని పెద్ద మనిషి పెరియార్ ద్వారా ప్రతి ఒక్కరికి తెలిసిందని వివరించారు. పెరియార్‌ను ఏ ఒక్క పార్టీనో తమవాడని చెప్పడానికి లేదని, ఆయన తమిళనాడు మొత్తానికి చెందిన మహానుభావుడని తెలిపారు.
‘మనందరికి సనాతన అనే పదం పెరియార్ ద్వారానే తెలిసింది. ఆయన ఆలయంలో పని చేసేవారు. నుదుటి పై తిలకం ధరించి వారణాసిలోని ఓ గుడిలో పూజలు చేసేవారు. అలాంటి వ్యక్తి వాటన్నింటిని విసిరేశాడంటే ఆయనకు ఎంత కోపం వచ్చి ఉంటుందో ఊహించుకోండి. ప్రజలకు సేవ చేయడమే అతిపెద్ద సేవ అని పెరియార్ రియలైజ్ అయ్యారు. ఆయన జీవితం మొత్తం అలాగే జీవించారు. డీఎంకే లేదా ఇతర ఏ పార్టీ అయినా పెరియార్ తమ వారేనని చెప్పడానికి వీల్లేదు. ఆయన ఏ ఒక్క పార్టీకి చెందిన వ్యక్తో కాదు. తమిళనాడు మొత్తం పెరియార్ తమవారేనని ఉత్సవం చేసుకుంటుంది’ అని కమల్ హాసన్ తెలిపారు.
Also Read: పార్లమెంటులో బీఎస్పీ ఎంపీపై బీజేపీ ఎంపీ విద్వేష వ్యాఖ్యలు.. ‘ఇది దేశానికే సిగ్గు చేటు’
ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. ఈ వివాదం వేడిగా ఉన్నప్పుడు కూడా కమల్ హాసన్ ఎక్స్‌లో స్పందించారు. ‘ఆయన అభిప్రాయంతో మీరు విభేదిస్తే.. సనాతన ధర్మానికి చెందిన గొప్ప విషయాలను ప్రస్తావిస్తూ చర్చ చేయడం మంచిది. అంతేకానీ, బెదిరింపులు, హింస, న్యాయపరమై బెదిరింపులకు దిగడం కుత్సిత రీతిలో రాజకీయ లబ్ది కోసం భావోద్వేగాలను రెచ్చగొట్టడం సమంజసం కాదు’ అని కమల్ హాసన్ పేర్కొన్నారు. సనాతన ధర్మంపై రేగిన వివాదం అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ దుమారాన్ని కూడా రేపింది.