పార్లమెంటులో బీఎస్పీ ఎంపీపై బీజేపీ ఎంపీ విద్వేష వ్యాఖ్యలు.. ‘ఇది దేశానికే సిగ్గు చేటు’
పార్లమెంటులో బీఎస్పీ ఎంపీ దానిశ్ అలీపై బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరి చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేపాయి. ఇది దేశానికే సిగ్గు చేటు అని దానిశ్ అలీ కామెంట్ చేశారు. రమేశ్ బిధూరిపై యాక్షన్ తీసుకోవాలని ఆయన ఈ రోజు స్పీకర్‌కు లేఖ రాశారు.

న్యూఢిల్లీ: నిన్న సాయంత్రం లోక్ సభలో బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరి బీఎస్పీ ఎంపీ దానిశ్ అలీ పై విద్వేష వ్యాఖ్యలు చేశారు. ముల్లా, ముల్లా టెర్రరిస్టు, పింప్ అంటూ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై సభలో అలజడి రేగింది. స్పీకర్ లోక్ సభ రికార్డుల నుంచి ఆయన వ్యాఖ్యలను తొలగించారు. ఆయన వ్యాఖ్యలకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ క్షమాపణలు చేశారు. తాజాగా, బీఎస్పీ దానిశ్ అలీ స్పీకర్ ఓంబిర్లాకు లేఖ రాశారు.
చంద్రయాన్ సక్సెస్ కావడంపై లోక్ సభలో చర్చ జరుగుతుండగా దానిశ్ అలీపై రమేశ్ బిధూరి నోరుపారేసుకున్నారు. ఒక ఎన్నికైన ఎంపీని వారి కమ్యూనిటీతో ముడిపెట్టి దాడి చేయాలనే ఈ ప్రత్యేక సమావేశాలకు పిలుపు ఇచ్చారా? అని దానిశ్ అలీ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ తెలిపారు. ఇది దేశం మొత్తానికే సిగ్గు చేటు అని చెప్పారు. ఆ పార్టీ సదరు ఎంపీపై చర్యలు తీసుకుంటుందా? లేక ప్రమోట్ చేస్తుందా? అనేది చూడాలని వివరించారు. ఆయన వ్యాఖ్యలు విద్వేషపూరితమైనవని స్పష్టం చేశారు. భారత న్యూల్యాబరేటరీలో ఇవే నేర్పుతున్నారా? అని ప్రశ్నించారు. ఒక ఎన్నికైన ఎంపీపై ఇలాంటి అభ్యంతరకర భాషను వాడటం ఇదే తొలిసారి అని వివరించారు.
Also Read: Shocking: బార్‌లోని రానివ్వలేదని ఐదుగురిని షూట్ చేసిన మహిళ
స్పీకర్ ఓంబిర్లాకు రాసిన లేఖలో దానిశ్ అలీ ఇలా పేర్కొన్నారు. ‘కొత్త పార్లమెంటు భవనంలో స్పీకర్‌గా మీ సారథ్యంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరం. ఇది నా హృదయాన్ని బద్ధలు చేసింది. ఒ మైనార్టీ సభ్యుడిగా, ఒక ఎన్నికైన సభ్యుడిగా ఇలాంటి వ్యాఖ్యలు ఎదుర్కోవడం బాధాకరంగా ఉన్నది. ఆయనపై వెంటనే సంబంధిత నిబంధనల కింద చర్యలు తీసుకోవాలి. తద్వార దేశంలో పరిస్థితులు విషపూరితం కాకుండా ఆపగలం. దయచేసి ఈ ఘటనపై దర్యాప్తును ఆదేశించాలి’ అని ఆయన స్పీకర్‌ను కోరారు.
సౌత్ ఢిల్లీ ఎంపీ రమేశ్ బిధూరిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పీకర్ ఈ రోజు హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించారు. ఆయన క్షమాపణలు చెప్పాలని, వెంటనే సస్పెండ్ లేదా అరెస్టు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.