రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించినప్పటి నుంచి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారనే విషయంపై ఊహాగానాలు చెలరేగుతూ వస్తున్నాయి. 

చెన్నై: రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించినప్పటి నుంచి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారనే విషయంపై ఊహాగానాలు చెలరేగుతూ వస్తున్నాయి. 2019 ఎన్నికల్లో ఆయన ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారనే విషయంపై జరుగుతున్న ప్రచారానికి విరుద్ధమైన సంకేతాలను తన కాలా సినిమా ద్వారా ఆయన ఇచ్చారు. 

తాను పార్టీ పెడుతానని గత డిసెంబర్ లో రజనీకాంత్ ప్రకటించారు. ఆ తర్వాత వచ్చిన ఆయన మొదటి సినిమా కాలానే. తమిళనాడులో 2021లో జరిగే శాసనసభ ఎన్నికల్లో అన్ని సీట్లకు తన పార్టీ పోటీ చేస్తుందని ఆయన ప్రకటించారు. దాన్ని బిజెపి ఆహ్వానించింది. తన వెనక బిజెపి ఉందనే వ్యాఖ్యలను ఆయన ఈ ఏడాది ఆరంభంలో ఖండించారు. 
కాషాయం రంగు కాకపోతే రజనీకాంత్ తో కలిసి నడుస్తానని ఫిబ్రవరిలో తన పార్టీని ప్రకటించిన మరో తమిళ నటుడు కమలహాసన్ ప్రకటించిన నేపథ్యంలో రజనీకాంత్ ఆ ఖండన ఇచ్చారు. 

వ్యవస్థను మార్చడానికి తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు రజనీకాంత్ గత డిసెంబర్ లో చెప్పారు. దాంతో కాలాలో ఆయన రాజకీయాలకు సంబంధించిన సంకేతాలు ఉండవచ్చునని భావించారు. కాలా సినిమాను ముంబైలోని ధరవి మురికివాడ నేపథ్యంలో తీశారు. 

రజనీకాంత్ పోషించిన కాలా పాత్ర బస్తీవాసుల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన రాజకీయ నాయకుడికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. బస్తీవాసుల భూములను లాక్కోవడానికి అతను ప్రయత్నిస్తుంటాడు. దానిపై కాలా పోరాటం చేస్తాడు. ప్రతి నాయకుడి పాత్రను నానా పటేకర్ పోషించారు. నానా పటేకర్ పాత్రను రైట్ వింగ్ పొలిటికల్ లీడర్ గా చూపించారు.

రాజకీయ ఎజెండాతో సినిమాను నిర్మించినట్లు జరిగిన ప్రచారాన్ని దర్శకుడు రంజిత్ ఖండించారు. సినిమా చివరలో హీరో కరికాల తాను రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు కూడా ఏమీ చెప్పడు. రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ కోసం ఈ సినిమాను తీయలేదని రంజిత్ చెప్పారు. 

కాలా రాజకీయాలపై చర్చిస్తుందని, కానీ అది పొలిటికల్ ఫిల్మ్ కాదని విడుదలకు ముందు రజనీకాంత్ కూడా చెప్పారు. విస్డృతమైన అభిమానులున్న రజనీకాంత్ ను తమ వైపు తిప్పుకుని దక్షిణాదిన పాగా వేయాలని బిజెపి ప్రయత్నిస్తోందని చెబుతూ వస్తున్నారు. కానీ సినిమా ఇచ్చిన సంకేతాలను బట్టి చూస్తే రజనీకాంత్ ఆలోచన మరో విధంగా ఉన్నట్లు కనిపిస్తోంది.