సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఈ రోజు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎస్ వెంకటనారాయణ భట్టిలు ప్రమాణం తీసుకున్నారు. సుప్రీంకోర్టు ఆడిటోరియం హాల్‌లో వీరితో సీజే జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రమాణం చేయించారు.

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఈ రోజు ఇద్దరు జడ్జీలు ప్రమాణం తీసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో సుప్రీంకోర్టు ఆడిటోరియంలో ఇధ్దరు న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎస్ వెంకటనారాయణ భట్టిలతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రమాణం చేయించారు.

సుప్రీంకోర్టులో మొత్తం 34 మంది న్యాయమూర్తులకు అవకాశం ఉంటుంది. తాజాగా ఇద్దరు న్యాయమూర్తుల చేరికతో ప్రస్తుతం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 32కు పెరిగింది. కాగా, మరో రెండు ఖాళీలు ఉన్నాయి.

జస్టిస్ ఉజ్జల్ భుయాన్ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించారు. జస్టిస్ ఎస్ వెంకటనారాయణ భట్టి కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవలే జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని సుప్రీంకోర్టు కొలీజియం వీరిద్దరికీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసులు చేశారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో తాజాగా, వారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు.

Also Read: డబ్బుల వెంట పరుగులు పెట్టి లైఫ్ బోర్ కొట్టింది.. ట్రక్కు డ్రైవర్‌గా కంపెనీ సీఈవో

1962 మే 6వ తేదీన ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో జస్టిస్ ఎస్ వెంకటనారాయణ భట్టి జన్మించారు. ఏపీ హైకోర్టు జడ్జీగా సేవలు అందించారు. 2019లో కేరళ హైకోర్టుకు బదిలీపై వెళ్లారు. కాగా, ఈ ఏడాది జూన్ 1వ తేదీన కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు తీసుకున్నారు. 

Scroll to load tweet…

కాగా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ 1964 ఆగస్టు 2వ తేదీన జన్మించారు. గౌహతి హైకోర్టులో జడ్జీగా సేవలు అందించారు. బొంబాయ్ హైకోర్టు న్యాయమూర్తిగానూ ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. కాగా, గతేడాది జూన్ 29వ తేదీన ఆయన తెలంగాణ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా ఉద్యోగోన్నతి పొందారు.