డబ్బుల వెంట పరుగులు పెట్టి లైఫ్ బోర్ కొట్టింది.. ట్రక్కు డ్రైవర్‌గా కంపెనీ సీఈవో

ఆ ఆస్ట్రేలియా వాసి తన కెరీర్ సాధారణ ఉద్యోగం నుంచి ఓ కంపెనీ సీఈవోగా ఎదిగాడు. ఆస్తులతోపాటు హోదానూ సంపాదించుకున్నాడు. సకల సౌకర్యాలున్నా ఏదో వెలితి నిరంతరం వెన్నాడింది. తన మనసు మాట వింటా అంటూ సీఈవో పదవికి రాజీనామా చేసి ఒత్తిళ్లు లేని ట్రావెల్ చేసే ట్రక్కు డ్రైవర్‌గా మారాడు.
 

australia company ceo turned as a truck driver to persue happy life kms

లైఫ్ అంటే ఎవరికి వారు ఇచ్చుకునే యూనిక్ డెఫినేషన్. ఒకరి లైఫ్‌ను మరొకరితో పోల్చలేం. కొందరు ఆనందం దొరికే పనులు చేస్తే మరికొందరు.. ఇతర అవసరాల కోసం, లేదా ఇతరుల ఆనందం కోసం పనులు చేస్తుంటారు. మరికొందరు తనను తాను మరిచిపోయి వస్తుగత ప్రపంచంలో కొట్టుకుపోతారు. డబ్బులు సంపాదించే రేస్‌లో సర్వశక్తులొడ్డి పోటీపడతారు. ఇలా ఓ వ్యక్తి పోటీ పడి అలసిపోయాడు. తాను ఎందుకోసం జీవిస్తున్నా? తనకేం కావాలి? అంటూ అంతర్ముఖుడయ్యాడు. చివరకు ఓ డెసిషన్ తీసుకున్నాడు. అంతే.. సీఈవోగా తన బోరింగ్ లైఫ్‌ నుంచి తప్పుకున్నాడు. ట్రక్కు డ్రైవర్‌గా మారిపోయాడు. ఇందులోనే ఇప్పుడు జీవితాన్ని ఆస్వాదిస్తున్నా అంటూ ఆ వ్యక్తి సంతోషంగా చెబుతున్నాడు.

ఆస్ట్రేలియా వాసి గ్రెగ్ రాస్ యవ్వనంలోనే ఉద్యోగ జీవితంలోకి దూకాడు. తొలుత కార్ల కంపెనీలో మార్కెటింగ్ అధికారిగా కెరీర్ ప్రారంభించాడు. అంతా అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి. చేతి నిండా డబ్బు.. దేనికీ కొదవ లేకుండా లైఫ్ సాగుతున్నది. కానీ, కాలం గడుస్తున్న కొద్దీ తాను ఏదో కోల్పోతున్నానని, మరేదో తాను పొందలేకపోతున్నానని మదనపడ్డాడు. ఉద్యోగం వదిలిపెట్టాలని అనుకున్నాడు. కానీ, అప్పటికే అతనిపై వచ్చి పడ్డ బాధ్యతలు, కుటుంబం గురించి ఆలోచించి ఆ రేసు నుంచి తప్పుకోలేకపోయాడు. 

అలా ఉద్యోగాలు చేస్తూ ఓ సినిమా హాళ్ల కంపెనీకి సీఈవోగా ఎదిగాడు. ఇప్పుడు ఆస్తులతోపాటు హోదా కూడా సంపాదించుకున్నాడు. అయినా.. లైఫ్‌లో ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ వెంటాడుతూనే ఉన్నది. జీవితంలో ఏదో వెలితి ఇబ్బంది పెడుతూనే ఉన్నది.

Also Read: మిరాకిల్: యాక్సిడెంట్ తర్వాత బాలుడి తలను తిరిగి అతికించిన ఇజ్రాయెల్ డాక్టర్లు

ఈ సారి మాత్రం ఆయన రాజీపడలేదు. లైఫ్ ఎంజాయ్ చేయాల్సిందే అనుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన జీవితం, కుటుంబం కొంత కుదురుకున్నది. బాధ్యతలున్నట్టే ఇప్పుడు భరోసా కూడా ఉన్నది. సీఈవో సీటుకు రిజైన్ చేయాలని ఫిక్స్ అయిపోయాడు. సాధారణ జీవితం గడపాలని అనుకున్నాడు. ఒత్తిళ్లకు దూరంగా ప్రశాంతమైన జీవితం గడపాలని నిర్ణయించుకున్నాడు. ఉద్యోగానికి రాజీనామా చేసి ఓ ట్రాన్స్‌పోర్టింగ్ కంపెనీలో ట్రక్కు డ్రైవర్‌గా కుదిరాడు. జీతం తక్కువైనా ఒత్తిడి లేని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. 

ప్రస్తుతం గ్రెగ్ 72 ఏళ్ల వయస్సులో ఉన్న యవ్వన జీవితాన్వేషి. రెండు దశాబ్దాల కింద గ్రెగ్ థైరాయిడ్ క్యాన్సర్ బారిన పడ్డాడు. మరో మూడు నెలలు మాత్రమే నీకు భూమి మీద నూకలున్నాయని వైద్యులు హెచ్చరించారు. కానీ, గ్రెగ్ ఆ మహమ్మారిని జయించాడు. ఇప్పుడు జీవితాన్ని జయిస్తున్నాడు. సీఈవో ఉద్యోగాన్ని వదిలి 12 ఏళ్లుగా సాధారణ సారీ సంతోషమయ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios