ఇండియా పేరు పెట్టుకుంటే తీరు మారుతుందా?: విపక్షాల తీరుపై మోడీ సెటైర్లు
ఇండియా అనే పేరు పెట్టుకున్నంత మాత్రాన విపక్షాల తీరు మారుతుందా అని మోడీ ప్రశ్నించారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.

న్యూఢిల్లీ: ఇండియా అనే పేరు పెట్టుకున్నంత మాత్రాన విపక్షాల తీరు మారుతుందా అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. మంగళవారంనాడు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం న్యూఢిల్లీలో జరిగింది.ఈ సమావేశంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. విపక్ష ఇండియా కూటమిని ఆయన ఈస్టిండియా కంపెనీతో పోల్చారు. నిరసన తెలపడమే విపక్షాల పని అని ఆయన అన్నారు. 2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని మోడీ బీజేపీ ఎంపీలను కోరారు.
ఇండియాకు వచ్చిన తర్వాత బ్రిటీషర్లు కూడ తమ కంపెనీని ఈస్టిండియాగా పేరు పెట్టుకున్న విషయాన్ని ప్రధాని మోడీ గుర్తు చేశారు. ఇదే తరహలోనే విపక్షాలు తమ కూటమికి ఇండియా అనే పేరును పెట్టుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఇండియా అనే పేరు పెట్టుకున్నంత మాత్రాన ఆ పద్దతులు మారుతాయా అని ఆయన విపక్షాలనుద్దేశించి హేళన చేశారు.
ఈస్టిండియా కంపెనీ పేరులో కూడ ఇండియా ఉందన్నారు. ఇండియన్ ముజాహిదీన్ పేరులో కూడ ఇండియా ఉందని ఆయన వ్యాఖ్యలు చేశారు. అదే తరహాలో విపక్ష కూటమి కూడ ఇండియా అనే పేరును పెట్టుకుందని మోడీ ఎద్దేవా చేశారు. ఇలాంటి దిక్కులేని విపక్షాన్ని తాను ఏనాడూ చూడలేదని మోడీ వ్యాఖ్యలు చేశారు.