బిహార్ మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఓ కమ్యూనిటీ సమావేశానికి హాజరైన మాంఝీ.. మత రాజకీయాల అంశాన్ని ప్రస్తావించారు. కొందరు బ్రాహ్మణులు పేదల ఇంటిలో ఆహారం తినబోరని, కానీ, డబ్బులు మాత్రం తీసుకుంటారని పేర్కొన్నారు. ఇదే సందర్భంలో ఆయన సిగ్గు లేదు అనే పదాన్ని ఉపయోగించారు.
పాట్నా: మన దేశంలో మతం, కులాలపై వ్యాఖ్యలు ఎప్పుడూ చర్చనీయాంశం అవుతాయి. ఈ రెండు అంశాలు సున్నితమైనవి. ఏ ఒక్క మతాన్ని, కులాన్ని తక్కువ చేసినా.. లేదా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినా వివాదమై కూర్చుంటుంది. రాజకీయ నేతలకూ ఈ విషయం తెలుసు. చాలా సార్లు వాళ్లు ముప్పును ఎంచి వ్యాఖ్యలు చేస్తుంటారు. కానీ, కొన్ని సార్లు పొలిటికల్ లీడర్లు చేసే వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతాయి. తాజాగా, Bihar మాజీ సీఎం, హిందుస్తానీ ఆవామ్ మోర్చా (HAM) చీఫ్ జితన్ రామ్ మాంఝీ(Jitan Ram Manjhi).. బ్రాహ్మణు(Brahmin Community)లపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. పండితులు వస్తారు.. డబ్బులు తీసుకుంటారు.. కానీ, ఆహారం మాత్రం తినరని ఆయన అన్నారు. వీటికి తోడు ‘సిగ్గు లేదు’ అనే పదాన్ని తన వ్యాఖ్యలో ఉపయోగించారు.
బిహార్ రాజధాని పాట్నాలో భుయాన్ ముసాహర్ కమ్యూనిటీ నిర్వహించిన ఓ కార్యక్రమానికి మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మతాల ఆధారంగా రాజకీయాలు చేయడం, బ్రాహ్మణ కులంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ‘నేడు పేద వర్గాల్లో మతం పట్ల ఆరాధన భావన పెరుగుతుండటాన్ని చూస్తున్నాం. మనకు సత్నారాయణ్ అనే పేరు తెలియదు. ఆ పూజలు తెలియవు. కానీ, ఇప్పుడు ఎక్కడ చూసినా సత్నారాయణకు పూజలు చేస్తుండటాన్ని చూస్తున్నాం. వీరికసలు సిగ్గే లేదు. ఆ పండితులు వస్తారు.. వీరి ఇంట్లో ఏమీ తినబోమని చెబుతారు. దానికి బదులు డబ్బులు తీసుకుంటారు. ఈ వ్యాఖ్యలు ఎన్‌డీఏను వివాదంలోకి నెట్టింది. హిందూస్తానీ ఆవామ్ మోర్చా కూడా ఎన్‌డీఏలో భాగంగా ఉన్నది.
Also Read: హిందూ దేవుళ్ళ మీద కించపరిచే వ్యాఖ్యలు.. హనీ జాన్సన్ అరెస్ట్.. !
ఈ వ్యాఖ్యలు దుమారం రేపడంతో ఆయన క్షమాపణలు చెప్పారు. తాను పండితులను ఏమీ అనలేదని, కానీ, తన తోటి దళితులనే మందలించినట్టు చెప్పారు. వారు తన వ్యాఖ్యలతో బాధపడితే.. అందుకు క్షమాపణలు అని వివరించారు. దళితుల్లో ఆత్మాభిమానాన్ని కలిగించడానికి తాను వారిపై సీరియస్ అయినట్టు తెలిపారు. తాను అన్ని వర్గాలను, అన్ని కులాల వారినీ గౌరవిస్తారని చెప్పారు. తాను తన కుటుంబాన్ని గౌరవించినట్టుగానే ఇతరులు అందరినీ, అన్ని వర్గాలను గౌరవిస్తారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై ఆర్జేడీ ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ మాట్లాడుతూ.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఒడిలో ఉన్న జితన్ రామ్ మాంఝీకి కూడా వారి భాషనే ఒంటబట్టిందని విమర్శించారు. బ్రాహ్మణులపై ఆయన చేసిన వ్యాఖ్యలు సరికావని, అవి క్షమార్హం కావని తెలిపారు. ఆయన సీనియర్ రాజకీయ నేత అని, మాజీ సీఎం అని.. అలాంటి వ్యక్తి బ్రాహ్మణులపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
జితన్ రామ్ మాంఝీ వ్యాఖ్యలు దుమారం రేపడంతో ఆయన పార్టీ ప్రతినిధి దానిష్ రిజ్వాన్ రంగంలోకి దిగారు. మాంఝీ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని ఆయన తెలిపారు. ఆయనకు అన్ని కులాలు, తెగలపట్ల అభిమానం ఉన్నదని వివరించారు. కొందరు బ్రాహ్మణులు పేదల ఇంట ఆహారం తినకున్నా.. డబ్బు మాత్రం పుచ్చుకుంటారని పేర్కొన్నారు. అలా డబ్బులు ఇచ్చే వారినే మాంఝీ వ్యతిరేకించారని తెలిపారు.
