జార్ఖండ్‌లో కాంగ్రెస్-జేఎంఎం-ఆర్జేడీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంకీర్ణ కూటమి ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్‌ను రాష్ట్ర గవర్నర్ ద్రౌపది ముర్ము ఆహ్వానించారు.

Also Read:రుణభారం, నిరుద్యోగం: చుట్టూ సమస్యలు.. హేమంత్‌కు కత్తిమీద సామే

అదే సమయంలో హేమంత్ ప్రమాణ స్వీకరానికి కూడా ప్రభుత్వం, జేఎంఎం శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. డిసెంబర్ 29న జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులను ఆహ్వానించాలని సోరెన్ నిర్ణయించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించేందుకు సోరెన్ బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు.

Also Read:జార్ఖండ్ :అధికారంలోకి కాంగ్రెస్ కూటమి, సీఎం సహా ఆరుగురు మంత్రులకు ఓటమి

మరోవైపు ప్రమాణ స్వీకారానికి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ వస్తారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే ఈ పుకార్లను ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ ఖండించారు.

ప్రస్తుతం లాలూ ఆరోగ్యం సరిగా లేదని, డిసెంబర్ 29న హేమంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరుకారని తేజస్వీ వెల్లడించారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్-జేఎంఎం-ఆర్జేడీ కూటమి 47 సీట్లతో అధికారాన్ని హస్తగతం చేసుకుంది.