జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-జేఎంఎం-ఆర్జేడీ కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న హేమంత్ సోరెన్‌కు పెను సవాళ్లు స్వాగతం పలకబోతున్నాయి.

వీటిలో ప్రధానమైనది అప్పుల భారం. రఘుబర్‌దాస్ అధికారంలోకి వచ్చే సమయానికి రూ.37,593 కోట్లగా ఉన్న అప్పు ప్రస్తుతం రూ.85 వేల కోట్లకు చేరింది. దీనిని తగ్గించేందుకు హేమంత్ పకడ్బందీగా వ్యవహరించాల్సి ఉంటుంది.

Also Read:జార్ఖండ్ :అధికారంలోకి కాంగ్రెస్ కూటమి, సీఎం సహా ఆరుగురు మంత్రులకు ఓటమి

ఇదే సమయంలో ఎన్నికల హామీలో పేర్కొన్న రూ.6 వేల కోట్ల రైతు రుణమాఫీ మరో అదనపు భారం. ఆకలి చావుల కారణంగా జార్ఖండ్‌ పేరు తరచూ వినిపిస్తుంది. ఈ రాష్ట్రానికి ప్రతి ఏటా సుమారు 50 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు అవసరం.

అయితే వాతావరణ పరిస్ధితులు, ఇత కారణాల వల్ల కేవలం 40 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారోత్పత్తి మాత్రమే జరుగుతోంది. రాష్ట్ర జనాభాలో 36.96 శాతం మంతి ఇప్పటికీ దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారు.

వీరిందరికి ఆహార పదార్థాల సరఫరా సర్కార్‌కు సమస్యలను తీసుకొస్తోంది. ఇక మావోయిస్టులకు కంచుకోటలా ఉన్న రాష్ట్రాల్లో జార్ఖండ్ ఒకటి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నక్సల్స్‌ను అణచివేసేందుకు ఎంతగా ప్రయత్నిస్తున్నా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఇంకా మావోల హింసా కాండ కొనసాగుతూనే ఉంది.

అన్నింటిని మించి రాష్ట్రంలో అంతకంతకు పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్యను అరికట్టడం హేమంత్‌కు కత్తిమీద సామే. దేశంలో నిరుద్యోగులు ఎక్కువగా ఉన్న ఐదు రాష్ట్రాల్లో జార్ఖండ్ ఒకటి.

Also Read:సీఎంల ఓటమి చరిత్ర మరోసారి రిపీట్.... ఓటమి అంచున రఘుబర్ దాస్

రాష్ట్రంలో 46 శాతానికి పైగా పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 49 శాతానికి పైగా పట్టభద్రులు ఎలాంటి ఉపాధి లేకుండా ఖాళీగానే ఉన్నారు. తన ఎన్నికల హామీల్లోనూ నిరుద్యోగాన్ని ప్రస్తావించారు హేమంత్. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు మన రాష్ట్రంలోనే ఉపాధి కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

దీనితో పాటు ఉద్యోగం దొరికే వరకు నిరుద్యోగ భృతిని ఇస్తామని ఆయన వెల్లడించారు. దీంతో సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన ఎలాంటి చర్యలు చేపడతారోనని రాష్ట్ర ప్రజలు, రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.