జార్ఖండ్ 11వ ముఖ్యమంత్రిగా జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీలో జరిగిన కార్యక్రమంలో ఆయనతో రాష్ట్ర గవర్నర్ ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పలువురు హాజరయ్యారు.

డిసెంబర్ 23న వెలువడిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ కూటమి 47 సీట్లు గెలుచుకుని అధికారాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. జేఎంఎం 30, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 1 స్థానంలో విజయం సాధించాయి. బీజేపీ కేవలం 25 సీట్లు గెలుచుకుని అధికారాన్ని దూరం చేసుకుంది.

Also Read:రుణభారం, నిరుద్యోగం: చుట్టూ సమస్యలు.. హేమంత్‌కు కత్తిమీద సామే

కాగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన హేమంత్ సోరెన్‌కు పెను సవాళ్లు స్వాగతం పలకబోతున్నాయి. వీటిలో ప్రధానమైనది అప్పుల భారం. రఘుబర్‌దాస్ అధికారంలోకి వచ్చే సమయానికి రూ.37,593 కోట్లగా ఉన్న అప్పు ప్రస్తుతం రూ.85 వేల కోట్లకు చేరింది. దీనిని తగ్గించేందుకు హేమంత్ పకడ్బందీగా వ్యవహరించాల్సి ఉంటుంది.

ఇదే సమయంలో ఎన్నికల హామీలో పేర్కొన్న రూ.6 వేల కోట్ల రైతు రుణమాఫీ మరో అదనపు భారం. ఆకలి చావుల కారణంగా జార్ఖండ్‌ పేరు తరచూ వినిపిస్తుంది. ఈ రాష్ట్రానికి ప్రతి ఏటా సుమారు 50 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు అవసరం.

అయితే వాతావరణ పరిస్ధితులు, ఇత కారణాల వల్ల కేవలం 40 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారోత్పత్తి మాత్రమే జరుగుతోంది. రాష్ట్ర జనాభాలో 36.96 శాతం మంతి ఇప్పటికీ దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారు.

Also Read:జార్ఖండ్ :అధికారంలోకి కాంగ్రెస్ కూటమి, సీఎం సహా ఆరుగురు మంత్రులకు ఓటమి

వీరిందరికి ఆహార పదార్థాల సరఫరా సర్కార్‌కు సమస్యలను తీసుకొస్తోంది. ఇక మావోయిస్టులకు కంచుకోటలా ఉన్న రాష్ట్రాల్లో జార్ఖండ్ ఒకటి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నక్సల్స్‌ను అణచివేసేందుకు ఎంతగా ప్రయత్నిస్తున్నా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఇంకా మావోల హింసా కాండ కొనసాగుతూనే ఉంది. అన్నింటిని మించి రాష్ట్రంలో అంతకంతకు పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్యను అరికట్టడం హేమంత్‌కు కత్తిమీద సామే.