జమ్మూ కాశ్మీర్ హై అలర్ట్ ప్రకటించారు. మరోసారి ఉగ్రవాదులు దాడులకు తెగబడే  అవకాశం ఉందన్న నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. ఈసారి పర్యాటక ప్రాంతాలు కాదు ఉగ్రవాదులు వేటిని టార్గెట్ చేసారంట తెలుసా?  

జమ్మూ కాశ్మీర్ మళ్లీ ఉగ్రవాదులు రెచ్చిపోయే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా జైళ్లపై ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని తెలిపాయి. జమ్మూలోని శ్రీనగర్ సెంట్రల్ జైలు, కోట్ బల్వాల్ వంటి హై సెక్యూరిటీ జైళ్లు లక్ష్యంగా ఉండొచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి.

ఈ జైళ్లలోనే ప్రస్తుతం చాలా మంది హై ప్రొఫైల్ ఉగ్రవాదులు, స్లీపర్ సెల్ సభ్యులు ఉన్నారు. వీళ్ళు నేరుగా దాడుల్లో పాల్గొనకపోయినా ఉగ్రవాదులకు సాయం చేస్తారు, వాళ్ళకి ఆశ్రయం కల్పిస్తారు, వాళ్ళ కదలికలకు సహకరిస్తారు.

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన ఘటనలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తు వేగాన్ని పెంచింంది. ఉగ్రవాదులకు సహకరిస్తున్న నిసార్, ముస్తాక్‌లను విచారించింది. ఈ క్రమంలోనే జైళ్లపై దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. అయితే నిఘా హెచ్చరికల నేపథ్యంలో జైళ్ల భద్రతను సమీక్షించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

పరిస్థితిని సమీక్షించడానికి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్ ఆదివారం శ్రీనగర్‌లో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. 2023 అక్టోబర్‌లో సీఆర్పీఎఫ్ నుంచి జమ్మూ కాశ్మీర్ జైళ్ల భద్రత బాధ్యతను సీఐఎస్ఎఫ్ తీసుకుంది.

పహల్గాం దాడి జరిగిన వారం తర్వాత ఉగ్రవాదులు ఇంకా దక్షిణ కాశ్మీర్‌లోనే దాక్కుని ఉండొచ్చని ఎన్ఐఏ వర్గాలు సూచించాయి. నిఘావర్గాల సమాచారం ప్రకారం, ఈ ప్రాంతంలో మరింతమంది ఉగ్రవాదులు దాక్కుని ఉండొచ్చని తెలుస్తోంది. ఏప్రిల్ 22న పహల్గాం బైసరన్ లోయలో జరిగిన దాడిలో భద్రతా దళాలు వెంటనే ప్రతిఘటించడంతో మరికొందరు ఉగ్రవాదులు దూరంగా ఉండిపోయారని అనుమానిస్తున్నారు.

పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులు చాలా స్వతంత్రంగా వ్యవహరించారు. వాళ్ళు తమతోపాటు ఆహారం, ఇతర సామాగ్రిని తీసుకెళ్లారు. బయటి నుంచి ఎలాంటి సహాయం లేకుండానే అడవుల్లో చాలా కాలం పాటు ఉండగలిగారని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి.