న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ)కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం నిరసన వ్యక్తం చేస్తున్నవారిపై దుండగుడు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. అతను పిస్టల్ బయటకు తీయడానికి కొద్ది నిమిషాల ముందు ఫేస్ బుక్ లో లైవ్ ఇచ్చాడు. షూటర్ సెల్ఫీ ఫుటేజీని ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు.

తనను తాను అతను రామభక్త్ గోపాల్ గా చెప్పుకున్నాడు. నల్లటి స్లీవ్ లెస్ బాంబర్ జాకెట్ తొడుక్కుని అతను నిరసన వేదిక వద్ద తచ్చాడడం కూడా కనిపించింది. తన లక్ష్యాన్ని నిర్ణయించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా అతను కనిపించాడు. 

Also Read: జామీయ యూనివర్శిటీలో కాల్పుల కలకలం: విద్యార్ధికి గాయాలు

ఏహ్ లో ఆజాదీ (ఇక్కడ మీ స్వేచ్ఛ ఉంది) అంటూ గోపాల్ అరవడం వినిపించింది. అతను జరిపిన కాల్పుల్లో షాదాబా్ ఫరూఖ్ అనే విద్యార్థి గాయపడ్డాడు. ఎడమ చేతికి గాయమై రక్తమోడుతున్న విద్యార్థిని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థకు తరలించినప్పటికీ సంఘటనా స్థలంలో కేకలు మిన్నుముట్టాయి.

 

రామభక్త్ గోపాల్ ఇంతకు ముందు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. తదుపరి పరిణామాలకు అతను సిద్ధమైనట్లు ఆ పోస్టులు తెలియజేస్తున్నాయి. "నా చివరి ప్రయాణంలో నన్ను కాషాయంతో కప్పేయండి, జై శ్రీరామ్ అనే నినాదాలు ఇవ్వండి" అనే పోస్టు కూడా ఉంది. హిందూ మీడియా లేదంటూ కూడా ఓ పోస్టు పెట్టాడు. 

19 ఏళ్ల వయస్సు గల రామభక్త్ గోపాల్ ది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జేవార్ ప్రాంతం. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామభక్త్ గోపాల్ ను ఆపడానికి పోలీసులు ఏ మాత్రం ప్రయత్నించలేదని విద్యార్థులు విమర్శిస్తున్నారు.