పహల్గాం ఉగ్రదాడిని ఖండించినా పాకిస్థాన్ విషయంలో భారత విధానాలను సమర్దించకుండా చాలాదేశాలు తటస్థంగా వ్యవహరిస్తున్నాయి. ఇలాంటి యూరప్ దేశాలకు భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కౌంటర్ ఇచ్చారు. 

Pahalgam Attack: భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ ఆదివారం యూరప్ దేశాలకు కీలక సందేశం ఇచ్చారు. భారత్ భాగస్వాముల కోసం చూస్తోందని, సలహాదారుల కోసం కాదని స్పష్టం చేశారు. భారత్‌తో లోతైన సంబంధాల కోసం యూరప్ కొంత సున్నితత్వం, పరస్పర ప్రయోజనాలను చూపించాలని ఆయన అన్నారు. యూరోపియన్ యూనియన్ టాప్ డిప్లొమాట్ కాజా కలాస్ పహల్గాం ఉగ్రదాడిని ఖండించకుండా భారత్, పాకిస్తాన్ రెండింటినీ సంయమనం పాటించాలని కోరడంతో ఈ వ్యాఖ్యలు వచ్చాయి.

భాగస్వాములు కావాలి, సలహాదారులు వద్దు : ఎస్. జైశంకర్ 

'ఆర్కిటిక్ సర్కిల్ ఇండియా ఫోరం'లో యూరప్ నుంచి భారత్ అంచనాలపై అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ, జైశంకర్ సలహాలు ఇవ్వడం మానేసి పరస్పర ప్రయోజనాలతో కూడిన ఒప్పందం ఆధారంగా పనిచేయాలని అన్నారు. "మేము ప్రపంచాన్ని చూసినప్పుడు, మేము భాగస్వాముల కోసం చూస్తాం. సలహాదారుల కోసం కాదు. ముఖ్యంగా తమ దేశంలో ఆచరించని సలహాలు ఇతరులకు ఇచ్చేవారి కోసం కాదు" అని ఆయన అన్నారు.

 "మా దృక్కోణంలో, భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే కొంత అవగాహన ఉండాలి. కొంత సున్నితత్వం ఉండాలి. ప్రయోజనాలలో పరస్పర అంగీకారం ఉండాలి. ప్రపంచం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి. ఈ అంశాలన్నీ యూరప్‌లోని వివిధ ప్రాంతాల్లో వేర్వేరు స్థాయిల్లో ఉన్నాయి. కొన్ని ముందుకు వెళ్లాయి, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి" అని అన్నారు.

Scroll to load tweet…

కాజా కలాస్ భారత్-పాకిస్తాన్‌ల ఉద్రిక్తతలపై ఏమన్నారంటే..

శనివారం యూరోపియన్ యూనియన్ విదేశాంగ, భద్రతా విధాన ప్రతినిధి కాజా కలాస్ సోషల్ మీడియాలో భారత్, పాకిస్తాన్ రెండింటినీ సంయమనం పాటించాలని కోరారు. Xలో ఆయన ఇలా రాశారు, "భారత్, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇరు దేశాలు సంయమనం పాటించి, పరిస్థితిని మెరుగుపరచడానికి చర్చలు జరపాలని నేను కోరుతున్నాను. ఉద్రిక్తత పెంచడం వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు. నేను ఈరోజు డాక్టర్ ఎస్. జైశంకర్, ఇషాక్ దార్‌లతో మాట్లాడి ఈ సందేశాన్ని అందించాను." అంటూ ట్వీట్ చేసారు.