ఉప రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఎన్డీయే అభ్యర్ధిగా జగదీప్ ధన్‌కర్‌ను బీజేపీ ఎంపిక చేసింది. శనివారం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన సమావేశమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ ఈ మేరకు జగదీప్ అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేసింది.

ఉప రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఎన్డీయే అభ్యర్ధిగా జగదీప్ ధన్‌కర్‌ను బీజేపీ ఎంపిక చేసింది. శనివారం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన సమావేశమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ ఈ మేరకు జగదీప్ అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేసింది. సమావేశం అనంతరం జేపీ నడ్డా మీడియా సమావేశంలో ప్రకటన చేశారు. ఉప రాష్ట్రపతి అభ్యర్ధులుగా.. కేంద్ర మాజీ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నక్వీ, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, జమ్మూకాశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా, పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్, గవర్నర్లు ఆనందీబెన్ పటేల్, తమిళిసై సౌందరరాజన్, థావర్‌చంద్ గెహ్లాత్‌ల పేర్లు వినిపించాయి. అయితే వీరెవ్వరూ కాకుండా జగదీప్ ధన్‌కర్‌ను ఎన్డీయే పక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా బీజేపీ ఖరారు చేయడం జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 

ఇకపోతే.. ఉప రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఇటీవల ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 6న ఎన్నికలు నిర్వహించి అదే రోజున ఫలితాన్ని ప్రకటించనున్నారు. జూలై 5 నుంచి 17 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ ఏడాది ఆగష్టు 10వ తేదీతో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ముగియనుంది. దీంతో ఎన్నిక నిర్వహించడం అనివార్యమైంది.లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, నామినేటేడ్ సభ్యులతో కలిపి ఉపరాష్ట్రపతి పదవి కోసం ఎలక్టోరల్ కాలేజీని ఏర్పాటు చేస్తారు.

ALso REad:Vice Presidential elections : ఉప రాష్ట్రప‌తి ఉమ్మ‌డి అభ్య‌ర్థి కోసం జూలై 17న ప్ర‌తిప‌క్షాల మీటింగ్

కాగా.. ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం ఉమ్మ‌డి అభ్యర్థిపై చర్చించేందుకు ప్రతిపక్ష పార్టీలు జూలై 17వ తేదీన స‌మావేశం కానున్నాయి. ఈ విష‌యాన్ని సీనియ‌ర్ కాంగ్రెస్ నాయ‌కుడు, రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత మ‌ల్లికార్జున్ ఖర్గే బుధ‌వారం మీడియాతో వెల్ల‌డించారు. ఈ స‌మావేశానికి విప‌క్ష నేత‌లంద‌రూ హాజ‌ర‌వుతార‌ని చెప్పారు. అన్ని పార్టీల‌తో చ‌ర్చించి అంద‌రికీ ఆమోద్య‌యోగ్య‌మైన అభ్య‌ర్థినే ఎంపిక చేస్తామ‌ని తెలిపారు. 

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం ఉదయం అఖిలపక్ష సమావేశానికి కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈ నేప‌థ్యంలో విప‌క్షాల స‌మావేశం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. అయితే మ‌ల్లికార్జున్ ఖర్గే తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థికి ఆమోదం తెలిపారు. ‘‘ కాంగ్రెస్ నుండి అభ్యర్థి ఎవరూ లేరు. అన్ని పార్టీలు (ప్రతిపక్షాలు) అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తే వారితోనే మేము ఉంటామ‌ని పార్టీ అధ్య‌క్షుడు స్ప‌ష్టంగా చెప్పారు.’’ అని ఖర్గే తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికలకు ప్రతిపక్ష పార్టీల అభ్యర్థి యశ్వంత్ సిన్హాను ఎంపిక చేసిన విధంగానే.. ఉపరాష్ట్రపతి పదవికి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు ప్రతిపక్ష పార్టీలను సంప్రదించేందుకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న మలికార్జున్ ఖర్గేకు కాంగ్రెస్ టాస్క్ ఇచ్చింది.