ఉప రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభం అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల తరుఫున అభ్యర్థిని నిలబెట్టడానికి సన్నాహకాలు జరుగుతున్నాయి. జూలై 17వ తేదీన ప్రతిపక్షాలు అన్నీ సమావేశం కానున్నాయి. 

త్వ‌రలో జ‌ర‌గ‌నున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం ఉమ్మ‌డి అభ్యర్థిపై చర్చించేందుకు ప్రతిపక్ష పార్టీలు జూలై 17వ తేదీన స‌మావేశం కానున్నాయి. ఈ విష‌యాన్ని సీనియ‌ర్ కాంగ్రెస్ నాయ‌కుడు, రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత మ‌ల్లికార్జున్ ఖర్గే బుధ‌వారం మీడియాతో వెల్ల‌డించారు. ఈ స‌మావేశానికి విప‌క్ష నేత‌లంద‌రూ హాజ‌ర‌వుతార‌ని చెప్పారు. అన్ని పార్టీల‌తో చ‌ర్చించి అంద‌రికీ ఆమోద్య‌యోగ్య‌మైన అభ్య‌ర్థినే ఎంపిక చేస్తామ‌ని తెలిపారు. 

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం ఉదయం అఖిలపక్ష సమావేశానికి కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈ నేప‌థ్యంలో విప‌క్షాల స‌మావేశం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. అయితే మ‌ల్లికార్జున్ ఖర్గే తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థికి ఆమోదం తెలిపారు. ‘‘ కాంగ్రెస్ నుండి అభ్యర్థి ఎవరూ లేరు. అన్ని పార్టీలు (ప్రతిపక్షాలు) అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తే వారితోనే మేము ఉంటామ‌ని పార్టీ అధ్య‌క్షుడు స్ప‌ష్టంగా చెప్పారు.’’ అని ఖర్గే తెలిపారు.

కాగా రాష్ట్రపతి ఎన్నికలకు ప్రతిపక్ష పార్టీల అభ్యర్థి యశ్వంత్ సిన్హాను ఎంపిక చేసిన విధంగానే.. ఉపరాష్ట్రపతి పదవికి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు ప్రతిపక్ష పార్టీలను సంప్రదించేందుకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న మలికార్జున్ ఖర్గేకు కాంగ్రెస్ టాస్క్ ఇచ్చింది. అయితే ఆగస్టు 6న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. భారతదేశ 16వ ఉపరాష్ట్రపతి ఎన్నికలను ఆగస్టు 6, 2022న నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

ప్రధాని మోడీ లక్ష్యంగా టెర్రర్ కుట్ర.. ఇద్దరు మాజీ పోలీసుల అరెస్టు

ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్‌ను కూడా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఉప రాష్ట్రప‌తి ఎన్నిక‌ల కోసం నామినేష‌న్ల ప్ర‌క్రియ నేడు ప్రారంభ‌మ‌య్యాయి. జూలై 19వ తేదీన వ‌ర‌కు నామినేష‌న్లు స‌మ‌ర్పించేందుకు అవ‌కాశం ఉంది. నామినేషన్ల పరిశీలన జూలై 20వ తేదీన నిర్వ‌హించి, జూలై 22వ తేదీన తుది జాబితాను విడుద‌ల చేస్తారు. 

భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం పార్లమెంటులో ఓటింగ్ జరుగుతుంది. ఉప రాష్ట్రపతి ఎగువ స‌భ‌కు చైర్మ‌న్ గా వ్య‌హ‌రిస్తారు కావున ఆ పెద్ద‌ల స‌భ‌లోని స‌భ్యులు కూడా ఈ ఎన్నిక‌ల్లో పాల్గొంటారు. పోలింగ్ జ‌రిగిన రోజు సాయంత్ర‌మే ఫ‌లితాలు వెలువ‌డే అవ‌కాశం ఉంటుంది. అయితే 2017 సంవ‌త్స‌రంలో NDA ఉపరాష్ట్రపతి ఎన్నికలకు తన అభ్యర్థిగా వెంకయ్య నాయుడును ప్రతిపాదించింది. దీంతో ఆయ‌న భారతదేశానికి 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నిక‌య్యారు. ఆయన పదవీ కాలం ఆగస్టు 10, 2022తో ముగుస్తుంది.

Cancellation of OLA Ride: OLA, UBER క్యాబ్ డ్రైవర్ల‌కు షాక్ ! ఇక‌ ఏక‌ప‌క్ష నిర్ణ‌యాల‌కు చెక్

ఇదిలావుండగా రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లకు నామినేష‌న్ల ఉపసంహ‌ర‌ణ గ‌డువు గ‌త శ‌నివారంతో ముగిసింది. దీంతో ఎన్నిక‌ల బ‌రిలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) త‌ర‌ఫున అభ్య‌ర్థిగా ద్రౌపది ముర్ము, ప్ర‌తిప‌క్షాల ఉమ్మ‌డి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా మాత్ర‌మే నిలిచారు. ఈ ఎన్నిక‌లకు పోలింగ్ జూలై 18న ఉదయం 10 గంటల‌కు మొద‌లై సాయంత్రం 5 గంటల ముగుస్తాయి. ఎన్నిక ప్ర‌క్రియ అంతా పార్లమెంట్ హౌస్‌లోని రూమ్ నంబర్ 63లో జరుగుతుందని రాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ తెలిపారు.