సిక్కులను ఇంకా చంపాల్సింది.. నా పరువు తీశారు.. మూకతో జగదీశ్ టైట్లర్ అన్నారని సీబీఐ చార్జిషీట్
కాంగ్రెస్ నేత జగదీశ్ టైట్లర్ పై సిక్కుల ఊచకోత కేసుకు సంబంధించి సీబీఐ మే 20వ తేదీన ఓ చార్జిషీట్ ఫైల్ చేసింది. ఇందులో సంచలన విషయాలు పేర్కొంది. జగదీశ్ టైట్లర్ ఓ మూకను రెచ్చగొట్టాడని, ఆ మూకే గురుద్వారా పుల్ బంగాశ్‌కు నిప్పు పెట్టిందని, ముగ్గురు సిక్కులను చంపేసిందని ఆరోపించింది.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ లీడర్ జగదీశ్ టైట్లర్ మూకను రెచ్చగొట్టి సిక్కులను చంపేయించారని, గురుద్వారా పుల్ బంగాశ్‌కు రెచ్చిపోయిన మూక నిప్పు పెట్టిందని సీబీఐ తన చార్జిషీట్‌లో పేర్కొంది. మే 20న దాఖలు చేసిన ఈ చార్జిషీట్‌లో సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. 39 ఏళ్ల క్రితం నాటి సిక్కుల ఊచకోత కేసులో టైట్లర్ పై హత్యా నేరం కింద అభియోగాలు మోపారు.
సిక్కులను చంపాలని టైట్లర్ మూకను రెచ్చగొట్టారని సీబీఐ తెలిపింది. ఈ రెచ్చగొట్టుడు వల్లే గురుద్వారా పుల్ బంగాశ్‌కు నిప్పు పెట్టారని పేర్కొంది. 1984 నవంబర్ 1న సిక్కు కమ్యూనిటీకి చెందిన ముగ్గురిని మూక చంపేసిందని వివరించింది. టైట్లర్ రెచ్చగొట్టడం వల్లే మూక ఆ గురుద్వారాకు నిప్పు పెట్టిందని, ఠాకూర్ సింగ్, బాదల్‌లను హత్య చేసిందని తెలిపింది.
ఈ చార్జిషీట్‌లో పలువురు సాక్షుల కథనాలను పేర్కొంది. తమ షాప్ సహా పలు దుకాణాలను మూక దోచుకుంటున్నదని తెలుసుకున్న ఓ సాక్షి వెంటనే ఇంటికి బయల్దేరింది. గురుద్వారా పుల్ బంగాశ్‌కు సమీపంగా వెళ్లే మెయిన్ రోడ్ పై నుంచి తాను వెళ్లుతుండగా తెల్లటి అంబాసిడర్ కారులో జగదీశ్ టైట్లర్ బయటకు వచ్చాడని, దోపిడీ తర్వాత చేయవచ్చని, ముందు సిక్కులను చంపాలని మూకను రెచ్చగొట్టినట్టు తెలిపింది.
ఓ మూక పెట్రోల్ డబ్బాలు, కర్రలు, కత్తులు, రాడ్లు తీసుకెళ్లుతుండటాన్ని చూసినట్టు మరో సాక్షి వివరించాడు. గురుద్వారా పుల్ బంగాశ్ వద్ద జగదీశ్ టైట్లర్ కూడా ఉన్నట్టు చెప్పాడు. దీంతో వెంటనే టర్బన్ తీసేసి ఇంటికి వెళ్లిపోవాలని ప్రయాణికులు తనకు సూచించడంతో ఆటో రిక్షాలో ఇంటికి వెళ్లిపోయానని తెలిపాడు.
Also Read: TSRTC: ఆర్టీసీ కార్మికుల ఆశలకు అడ్డుపడాలని లేదు, కానీ..: గవర్నర్ తమిళిసై
నానావతి కమిషన్‌కు 2000లో సమర్పించిన అఫిడవిట్‌లో మరో సాక్షి ఇలా పేర్కొన్నాడు. ‘‘కేంద్రం పెద్ద నేతల కంటిలో తన విలువను దారుణంగా తక్కువ చేశారని నిందితుడు జగదీశ్ టైట్లర్ అన్నాడు. ఈస్ట్ ఢిల్లీ, ఔటర్ ఢిల్లీ, కంటోన్మెంట్ సహా పలు ప్రాంతాలతో పోల్చుకుంటే తన నియోజకవర్గంలో సిక్కుల హత్యలు చాలా తక్కువగా జరిగాయని, ఇది తన స్థానాన్ని దారుణంగా దిగజార్చించిందని అన్నారు. భారీ సంఖ్యలో సిక్కులను చంపిస్తానని మాటిచ్చాను. కానీ, మీరు నన్ను మోసం చేశారు. నా పరువు తీశారు’ అని ఆ జగదీశ్ టైట్లర్ చెప్పాడని సాక్షి వివరించాడు’ అని ఆ అఫిడవిట్ పేర్కొంది.