TSRTC: ఆర్టీసీ కార్మికుల ఆశలకు అడ్డుపడాలని లేదు, కానీ..: గవర్నర్ తమిళిసై
ఆర్టీసీ కార్మికుల ఆశలకు, కోరికకు తాను అడ్డుపడాలని అనుకోవడం లేదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. అయితే, ఆర్టీసీ విలీన ప్రక్రియ ద్వారా ప్రతి ఆర్టీసీ కార్మికుడు ప్రయోజనం పొందాలనే తాను ఆలోచిస్తున్నట్టు వివరించారు.
హైదరాబాద్: తెలంగాణలో ఒక వైపు అసెంబ్లీ సమావేశాలు హీట్ ఉండగా.. మరో వైపు ఆర్టీసీ బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు మధ్య జరుగుతున్న ఎపిసోడ్ కూడా ఆసక్తికరంగా మారింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే బిల్లును పెండింగ్‌లో పెట్టి రాష్ట్రప్రభుత్వాన్ని ఆమె వివరణలు అడగడం వంటి అంశాలు కార్మికుల్లో ఆందోళనలు రేపాయి. గవర్నర్ త్వరగా ఆమోదం తెలిపితే.. దాన్ని అసెంబ్లీలో ఆమోదించాల్సి ఉందని, లేదంటే ప్రభుత్వంలో విలీనమయ్యే తమ కోరిక ఆవిరవుతుందని కార్మికులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికుల చిరకాల కోరికకు అడ్డుపడాలని తనకేమీ లేదని స్పష్టం చేశారు. అయితే, ఆర్టీసీలోని ప్రతి ఉద్యోగి ప్రయోజనం పొందాలనేదే తన అభిప్రాయం అని వివరించారు.
ఆర్టీసీ విలీన ప్రక్రియకు అడ్డుపడాలనే ఉద్దేశం తనకు లేదని గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు. ఇది ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన భావోద్వేగ అంశమని వివరించారు. అయితే, ఈ భావోద్వేగ అంశం నిజం కావడంలో రాజ్‌భవన్ అడ్డుపడబోదని పేర్కొన్నారు. కానీ, ప్రతి ఒక్క ఆర్టీసీ ఉద్యోగి ప్రయోజనం పొందేలా ఈ ప్రక్రియ ఉండాలనేదే తన ఆలోచన అని వివరించారు. భవిష్యత్‌లోనూ ఎలాంటి న్యాయపరమై చిక్కులు తలెత్తకుండా విలీన ప్రక్రియ సజావుగా సాగిపోవాలని తెలిపారు.
Also Read: ఆర్టీసీ విలీనంపై రగడ: ఆ విషయం తెలిసి బాధపడ్డాను.. గవర్నర్ తమిళిసై
అయితే, ఆర్టీసీ ఉద్యోగులు కోరుకున్న అంశాలు, వారి ఆందోళనలను పూర్తి స్థాయిలో పరిష్కరించేలా ఈ బిల్లు ఉన్నదా? లేదా? అనేదే తనకిప్పడు ముఖ్యం అని గవర్నర్ తమిళిసై వివరించారు.