సూర్యుడిపై ప్రయోగానికి కౌంట్ డౌన్ మొదలైంది. రేపు ఉదయం 11.50 గంటలకు శ్రీహరికోటలోని షార్ నుంచి ఆదిత్య ఎల్-1 మిషన్‌ను ఇస్రో ప్రయోగించనుంది.
హైదరాబాద్: భారత అంతరిక్ష కేంద్రం ఇస్రో చంద్రయాన్ 3 మిషన్ సక్సె అయిన తర్వాత సూర్యుడి పై ప్రయోగాలకు రంగం సిద్ధం చేసుకుంది. ఆదిత్య ఎల్-1 మిషన్‌ను ప్రయోగించి సూర్యుడి రహస్యాలను ఛేదించనున్నారు. ఈ మిషన్ ప్రయోగానికి ఇప్పటికే కౌంట్ డౌన్ ప్రారంభమైంది. రేపు ఉదయం 11.50 గంటలకు ఆదిత్య ఎల్-1 మిషన్‌ను నింగిలోకి పంపనున్నారు. 24 గంటల ముందే కౌంట్ డౌన్ ప్రారంభమైంది.
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి ఆదిత్య ఎల్-1 మిషన్‌ను ఇస్రో ప్రయోగించనుంది. పీఎస్ఎల్వీ సీ-57 ఈ రాకెట్‌ను నింగిలోకి తీసుకెళ్లనుంది. ఆదిత్య ఎల్-1లో ఏడు పేలోడ్స్ ఉన్నాయి. ఈ పేలోడ్స్ సూర్యుడి గురించి రహస్యాలను, అంతరిక్షానికి చెందిన పలు కీలక విషయాలను కనుగొంటాయి. ఈ మిషన్ ప్రయోగించనున్న నేపథ్యంలో ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ సతీశ్ ధావ్ అంతరిక్ష కేంద్రంలో సమీక్ష నిర్వహిస్తున్నారు.
ఖగోళంలో పెద్ద వస్తువులకు దాని పరిమాణం(బరువు!) బట్టి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. అంటే.. భూమి కంటే సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువ. అయితే.. అది ఆ వస్తువు నుంచి దూరంగా జరుగుతున్నా కొద్దీ తగ్గుతుంది. సూర్యుడు, భూగ్రహానికి మధ్య ఉండే గురుత్వాకర్షణ శక్తులు ఎల్-1 అనే పాయింట్ వద్ద దాదాపుగా సమానంగా ఉంటాయి. అంటే.. గురుత్వాకర్షణ శక్తులు ఎల్-1 పాయింట్ వద్ద ఈక్విలిబ్రియంలో ఉంటాయి. కాబట్టి, అక్కడ ఒక శాటిలైట్‌ను తక్కువ ఇంధన ఖర్చుతో ఎక్కువ కాలం ఆపరేట్ చేయవచ్చు. అంటే.. తక్కువ ఖర్చుతో మనం దాన్ని మూవ్ చేయవచ్చు.
Also Read: Chandrayaan-3: చంద్రయాన్ 3 విజయం ఎందుకు ముఖ్యం? చంద్రయాన్ 4 గురించి మీకు తెలుసా?
ఎల్-1 పాయింట్ ఎంచుకోవడానికి మరో కారణం కూడా ఉన్నది. ఇక్కడ నుంచి సూర్యుడిని ఎలాంటి అవాంతరాలు లేకుండా నిరాటంకంగా మనం వీక్షించుకోగలం. అంటే సూర్యగ్రహణం, ఇతర గ్రహాల వల్ల సూర్యుడిని తాత్కాలికంగా చూడలేని పరిస్థితులు ఈ పాయింట్ వద్ద ఉండవు.
ఆదిత్య ఎల్-1 మిషన్‌ను కూడా కదులుతున్న భూమి, సూర్యుడికి అనుగుణంగా మూవ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే.. చాలా మంది అనుకున్నట్టు సూర్యుడు స్థిరంగా ఉండదు. సూర్యుడు కూడా వేగంగా కదులుతూ ఉంటే.. భూమి, ఇతర గ్రహాలు భిన్న కక్ష్యలో దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. స్పేస్ చాలా వేగంగా విస్తరిస్తున్నదనే విషయం తెలిసిందే. ఇది కాంతి కంటే కూడా కొన్ని లక్షల రెట్లు వేగంగా విస్తరిస్తుంది. అందుకే.. కాంతి వేగంతో మనిషి ప్రయాణించినా(ఇది దాదాపు అసాధ్యమే) విశ్వం అంచులకు(ఒక వేళ అవి ఉంటే) చేరలేడని నిపుణులు చెబుతుంటారు.
