చంద్రయాన్ 3 మిషన్ పై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. రేపు సాయంత్రం ల్యాండర్ జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద ల్యాండ్ కావాల్సి ఉన్నది. ల్యాండర్ నుంచి రోవర్ బయటికి వచ్చి తిరగాల్సి ఉన్నది. ఇది నిజంగా ఇస్రో శాస్త్రవేత్తల చంద్రుడిపై ప్రయోగాల్లో కీలక ముందడుగుగా రికార్డ్ అవుతుంది. 

న్యూఢిల్లీ: అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ అభివృద్ధి చెందిన అగ్ర దేశాల సరసన నిలుస్తున్నది. నాసా, రష్యా, చైనాల తర్వాత నాలుగో స్థానంలో విరాజిల్లుతున్నది. మరో గొప్ప విషయం ఏమిటంటే.. ఈ దేశాలు ఖర్చు పెట్టిన దాని కంటే తక్కువ మొత్తంతోనే ఇస్రో ప్రయోగాలు చేస్తున్నది. ఉదాహరణకు ఈ చంద్రయాన్ మిషన్ తీసుకున్నా అంతే.. నాసా చేపట్టిన ఆర్టెమిస్ అయినా.. రష్యా ఇటీవల పంపిన మిషన్ అయినా.. చంద్రయాన్ కంటే ఖరీదైన ప్రాజెక్టులే. ఆ దేశాలు అత్యధిక ఫ్యుయెల్ ఉపయోగించి భూమి, చంద్రుడి ఆకర్షణలను కాదని నేరుగా వెళ్లిపోతాయి. అయితే.. చంద్రయాన్ మాత్రం తక్కువ ఇంధనపు ఖర్చుతో భూమి చుట్టూ అలాగే చంద్రుని చుట్టూ కొన్ని ప్రదక్షిణలు చేసి వాటి ఆకర్షణను ఉపయోగించుకుంటుంది. 

ఇస్రో తక్కువ ఖర్చుతోనైనా ఘనమైన లక్ష్యాన్ని ముందుంచుకుంది. చంద్రుడిపై అధ్యయనాలు చేయడానికి చంద్రయాన్ మిషన్ ప్రారంభించింది. ఇందులో భాగంగా చంద్రయాన్ 1ను 2008లో ప్రయోగించింది. ఈ ప్రయోగం సక్సెస్ అయింది. చంద్రయాన్ 1లో ఆర్బిటర్, ఇంపాక్ట్ ప్రోబ్‌ను ప్రయోగించింది. ఇంపాక్ట్ ప్రోబ్ అక్కడి ఖనిజాల మ్యాప్ రెడీ చేసింది. ఈ మ్యాప్ ద్వారానే చంద్రుడిపై వాటర్ కంటెంట్ ఉండే అవకాశాలు ఉన్నాయని ఇస్రో చెప్పింది. ఆ తర్వాత చంద్రయాన్ 2 మిషన్‌ను 2019లో ఇస్రో ప్రయోగించిన సంగతి తెలిసిందే.

Also Read: Chandrayaan: ఇస్రో చేపడుతున్న చంద్రయాన్ మిషన్ అంతిమ లక్ష్యం ఏమిటీ?.. జాబిల్లిపై జీవించొచ్చా?

ఇందులో ఆర్టిటర్, విక్రమ్ ల్యాండర్, రోవర్‌ను చంద్రుడి మీదికి ప్రయోగించింది. ఆర్టిటర్ సరిగ్గానే చేరుకుంది. కానీ, విక్రమ్ సేఫ్‌గా ల్యాండ్ కాలేదు. దీంతో అది ధ్వంసమైంది. రోవర్ బయటకు రాకుండానే మిషన్ ముగిసిపోయింది. దీంతో ఇస్రో మరోసారి అదే ప్రయోగాన్ని లోపాలను సరిదిద్ది చంద్రయాన్ 3ని ఈ ఏడాది జులై 14న శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించింది. రేపు ఈ మిషన్ షెడ్యూల్ ప్రకారం చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద ల్యాండ్ కావాల్సి ఉన్నది. రేపు సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్ సేఫ్‌గా చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ కావాల్సి ఉన్నది. అందులో నుంచి ప్రజ్ఞాన్ రోవర్ బయటికి వచ్చి దక్షిణధ్రువం వద్ద తిరగాలి. తద్వారా దక్షిణ ధ్రువంపై పరిశోధనలు చేయాలని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ల్యాండర్‌ను సేఫ్‌గా ల్యాండ్ చేయించి అందులో నుంచి రోవర్‌ను బయటికి రప్పించి జాబిల్లి పై తింపడమే చంద్రయాన్ 3 ప్రధాన లక్ష్యంగా ఉన్నది.

చంద్రయాన్ మిషన్ ఇంతటితో ఆగిపోయేది కాదు. ఇది ఘనమైన లక్ష్యాన్ని పెట్టుకుంది. చంద్రయాన్ 3 తర్వాత కూడా పలు సంఖ్యలో మిషన్‌లను ప్రయోగించనుంది. రోవర్ అక్కడ తిరగడమే కాదు.. ఖనిజాలను పరిశీలించడం, చంద్రుడి మీద ఖనిజాలను తవ్వి తీయడం, ఆ తవ్వి తీసిన ఖనిజాలను భూమి పైకి తీసుకురావడం వంటి లక్ష్యాలు ఉన్నాయి. అయితే.. నాసా తలపెట్టిన ఆర్టెమిస్ ప్రోగ్రామ్ తరహాలో మనిషిని కూడా చంద్రుడి మీదికి పంపించే లక్ష్యం కూడా ఇస్రోకు ఉన్నదని కొందరు నిపుణులు చెబుతున్నారు. ముందున్న అసలైన లక్ష్యాలు సాధించడానికి చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం కావడం చాలా ముఖ్యం. రోవర్ చంద్రుడి ఉపరితలంపై తిరిగితే ఇస్రో శాస్త్రవేత్తల కృషికి ఫలితం దక్కినట్టే. తదుపరి ప్రయోగాలకు ఇదెంతో కీలకంగా ఉన్నది.