ఇస్రో తన మొదటి మానవ అంతరిక్ష-విమాన మిషన్ 'గగన్యాన్'లో భాగంగా ఈ ఏడాది చివరిలో రెండు ప్రాథమిక మిషన్లను ప్రారంభించనుందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.   

గగన్‌యాన్ : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రాజెక్ట్ గగన్‌యాన్ ను ప్రారంభించనున్నది. ఈ ప్రాజెక్టు అంతరిక్ష రంగంలో ఇస్రో ముందడుగు వేయనుంది. ఈ ఏడాది చివరి నాటికి.. గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా రెండు ప్రాథమిక మిషన్‌లను ఇస్రో ప్రారంభించనున్నదని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.

దాని తదుపరి దశలో.. ఇస్రో తన మొట్టమొదటి మానవ అంతరిక్ష-విమాన మిషన్ 2024లో ప్రారంభించబడుతుందనీ, స్వయం సమృద్ధి గల భారతదేశానికి గగన్‌యాన్ మిషన్ ఉత్తమ ఉదాహరణ అని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. భారత అంతరిక్ష యాత్ర చరిత్రలో ఇదొక మైలురాయిగా నిలుస్తుంది. గగన్‌యాన్ మిషన్‌ను రూ.10,000 కోట్లతో 2018లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

ఏడాది చివరిలో రెండు మిషన్లు ప్రారంభం

గగన్‌యాన్ కార్యక్రమం కింద రెండు ప్రారంభ మిషన్‌లను ఈ ఏడాది చివర్లో ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. మొదటి మిషన్ పూర్తిగా మానవరహితంగా ఉంటుందనీ, రెండవది 'వ్యోమిత్ర' అనే రోబోను తీసుకువెళుతుందని తెలిపారు. ఈ రెండు మిషన్లు అనుకున్న లక్ష్యాలను పూర్తి చేస్తాయని తెలిపారు. గగన్‌యాన్ రాకెట్ టేకాఫ్ అయిన మార్గంలో సురక్షితంగా తిరిగి వచ్చేలా చూడడమే ఈ మిషన్ల లక్ష్యం అని ఆయన చెప్పారు.

ఈ మిషన్ యొక్క తదుపరి భాగంగా.. దేశం యొక్క మొట్టమొదటి మానవ అంతరిక్ష-విమాన మిషన్ 2024లో ప్రారంభించబడుతుందనీ, దీని ద్వారా భారతీయ సంతతికి చెందిన వ్యక్తి అంతరిక్షంలోకి వెళ్తాడని తెలిపారు. ఈ సమయంలో .. ఇప్పటికే అంతరిక్షంలోకి వెళ్లిన రాకేష్ శర్మ గురించి కూడా ప్రస్తావించాడు. రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లిన మిషన్‌ను సోవియట్ రష్యా ప్రారంభించిందని ఆయన అన్నారు.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75వ సంవత్సరంలో ఈ మిషన్లను ప్రారంభించాలని యోచిస్తున్నామని, అయితే కరోనా మహమ్మారి కారణంగా ఈ కార్యక్రమాలు రెండు మూడు సంవత్సరాలు ఆలస్యమయ్యాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. మహమ్మారి కారణంగా రష్యాలో మన వ్యోమగాములకు కొనసాగుతున్న శిక్షణ మధ్యలోనే ఆగిపోయిందని ఆయన తెలియజేశారు. ఇప్పుడు కరోనా పరిస్థితి సద్దుమణిగిన తర్వాత.. వారి శిక్షణ పూర్తి చేయడానికి వెనక్కి పంపబడ్డాడు.

ఈ సందర్భంగా.. ఇస్రో మిషన్ చంద్రయాన్-3 , ఆదిత్య ఎల్1 గురించి కూడా కేంద్ర మంత్రి సమాచారం ఇచ్చారు. వచ్చే ఏడాది జూన్‌లో చంద్రుడిపైకి చంద్రయాన్-3 మిషన్‌ను ప్రయోగించాలని ఇస్రో యోచిస్తోందని ఆయన చెప్పారు. దీంతో పాటు సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు మిషన్ ఆదిత్య ఎల్1 సన్నాహాలు కూడా చకచకా సాగుతున్నాయి. సూర్యుని వాతావరణం, పర్యావరణం మరియు దానికి సంబంధించిన అన్ని అంశాలపై పరిశోధన మరియు అధ్యయనం చేయడం ఈ రకమైన మొదటి మిషన్ అని ఆయన చెప్పారు.

యాత్ర ఆలస్యం

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత అంతరిక్ష యాత్ర ఆలస్యంగా ప్రారంభమైందన్నారు. అమెరికా, అప్పటి సోవియట్‌ యూనియన్‌లు తమ పౌరులను చంద్రుడిపైకి దింపేందుకు సిద్ధమవుతున్న తరుణంలో భారత్ కూడా ఇలా కలలు కంటోందనీ, అయితే కొన్ని సంవత్సరాల క్రితం, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యానికి అంతరిక్ష రంగాన్ని తెరవాలని ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయించారు. ఆ తర్వాత అంతరిక్ష రంగంలో దేశ పరిశోధనలు పెరిగి నేడు అమెరికా, రష్యాలతో సమానంగా భారత్‌ నిలుస్తోందని తెలిపారు.

 ప్రస్తుతం ఈ రంగంలో 130కి పైగా స్టార్టప్‌లు ఉన్నాయని జితేంద్ర సింగ్ అన్నారు. ఇదొక్కటే కాదు, ప్రైవేట్ రంగం రాకెట్లను ప్రయోగించి, అంతరిక్ష రంగానికి ఊపునిస్తుంది . శాస్త్రవేత్తలకు ప్రోత్సాహాన్ని, ప్రతిష్టను ఇస్తోంది. నేడు భారత్‌కు చెందిన లాంచింగ్‌ ప్యాడ్‌ల నుంచి యూరప్‌, అమెరికాలకు చెందిన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపుతున్నట్లు తెలిపారు. కేవలం అమెరికా ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా ఇస్రో $56 మిలియన్లకు పైగా సంపాదించింది.