అమృత్ పాల్ సింగ్ వెనుక ఐఎస్ఐ, విదేశీ నిధులు, మాదకద్రవ్యాల ముఠాల సహకారం..!!
ఖలిస్థాన్ వేర్పాటు వాద వివాదాస్పద అమృత్ పాల్ సింగ్ వెనుక ఐఎస్ఐ హస్తం ఉన్నట్లుగా... అతనికి జార్జియాలో ట్రైనింగ్ ఇచ్చినట్లుగా నిఘా వర్గాలు చెబుతున్నాయి.

చండీగఢ్ : అమృత్ పాల్ సింగ్… ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న పేరు. దేశంలో ఉద్రిక్తతలకు తెరలేపుతూ.. ఖలిస్థాన్ సానుభూతిపరుడుగా పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. ఈ అమృత్ పాల్ సింగ్ వెనక పాకిస్తాన్ నిఘా సంస్థ (ఐఎస్ఐ) హస్తం ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విదేశీ నిధుల ప్రమేయం కూడా ఉన్నట్లు బలంగా వినిపిస్తోంది. వీటితోపాటు అమృత్ పాల్ సింగ్ కు మాదకద్రవ్యాల ముఠాలతో కూడా సన్నిహిత సంబంధాలు ఉండొచ్చు అని పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తు అధికారుల ప్రకారం అమృత్ పాల్ సింగ్ కు మెర్సిడెజ్ కారును ఈ ముఠాలే బహుమతిగా ఇచ్చాయని…ఆయుధాలకు సంబంధించిన సహకారాన్ని ఐఎస్ఐ అందిస్తోందని భావిస్తున్నారు.
అమృత్ పాల్ సింగ్ తమ కళ్లు గప్పి తప్పించుకున్న సమయంలో ఆ కారులోనే ఉన్నట్లుగా వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతేకాదు నిందితుడైన అమృత్ పాల్ సింగ్ కు ఓ ప్రైవేటు సైన్యమే ఉందన్నారు. పంజాబ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుఖ్ ఛైన్ సింగ్ గిల్ సోమవారం జాతీయ భద్రతా చట్టం కింద వీరిలోని ఐదుగురు వ్యక్తుల మీద కేసు నమోదు చేసినట్లుగా విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇప్పటివరకు వీరి మీద ఆరు కేసులు నమోదు చేశామన్నారు. 114 మందిని అరెస్టు చేసినట్లు సుఖ్ ఛైన్ సింగ్ గిల్ తెలిపారు.
లండన్ లో ఖలిస్తానీ మద్దతుదారులకు చెంపపెట్టు.. దింపిన చోటే.. భారీ స్థాయిలో ఎగురుతున్న త్రివర్ణపతాకం..
ఈ క్రమంలోనే శనివారం రాత్రి అమృత్ పాల్ సింగ్ మామయ్య హరిజీత్ సింగ్ లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఆయన మీదా ఎన్ఎస్ఏ కేసు నమోదు అయిందని.. అతనిని డిబ్రూగఢ్ జైలుకు తరలిస్తున్నామని తెలిపారు. అమృత్ పాల్ సింగ్ ను అరెస్టు చేస్తామని.. అతని మీద కూడా ఎన్ఎస్ఏ కేసు నమోదు చేస్తామని అన్నారు. అమృత్ పాల్ సింగ్ అనుచరులైన అతని మామయ్యతో పాటు.. డ్రైవర్ హరి ప్రీత్ సింగ్ కూడా ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత లొంగిపోయారు. ఇక పంజాబ్లో ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ లపై మంగళవారం మధ్యాహ్నం వరకు కూడా నిషేధం కొనసాగింది. ట్విట్టర్ అకౌంట్లు కూడా పనిచేయలేదు. ‘వారిస్ పంజాబ్ దే’ న్యాయవాది ఇమాన్ సింగ్ ఖారా ఈ పరిణామాల నేపథ్యంలో మాట్లాడుతూ.. అమృత్ పాల్ సింగ్ ను నకిలీ ఎన్కౌంటర్లో మట్టు పెట్టేందుకు పోలీసులు ఆలోచిస్తున్నారని, ఇప్పటికే అతనిని అరెస్టు చేశారని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
అమృత్ పాల్ సింగ్ చాలాకాలం దుబాయ్ లో ఉన్నాడని అక్కడ ఉన్న సమయంలోనే ఉగ్ర మూఠాలతో సంబంధాలు ఏర్పడ్డాయని దర్యాప్తులో వెలుగు చూసింది. 2012లో ట్రక్ డ్రైవర్ గా పని చేసేందుకు అమృత్ పాల్ సింగ్ దుబాయ్ కి వెళ్ళాడు. అక్కడే అతనికి ఉగ్రవాది పరమశిత్ సింగ్ పమ్మా, పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే ఖలిస్థాన్ నేత లఖ్ బీర్సింగ్ రోడే సోదరుడు జస్వంత్ లతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే దుబాయ్ నుంచి అమృత్ పాల్ సింగ్ ఇండియాకి వచ్చే కంటే ముందే జార్జియాకు వెళ్లినట్లుగా నిఘవర్గాల దర్యాప్తులో తెలిసింది. అక్కడే ఐఎస్ఐ శిక్షణ పొందినట్లు అనుమానిస్తున్నారు.
ఆ తర్వాత పంజాబ్ కి వచ్చిన అమృత్ పాల్ సింగ్ ‘వారిస్ పంజాబ్ దే’ను పక్కా ప్లాన్ ప్రకారమే తన గుప్పిట్లోకి తీసుకున్నాడు. వేగంగా ఎదిగాడు. పంజాబ్లో అశాంతిని రేకెత్తించాలన్న పక్కా ప్లాన్ తో దేశంలో అడుగుపెట్టిన అతని ఆలోచనలను అమలు చేశాడు. అమృత్ పాల్ సింగ్ కు ‘సిక్ ఫర్ జస్టిస్’ సంస్థతో కూడా సంబంధాలు ఉన్నాయని నిఘా వర్గాలు చెబుతున్నాయి.