ప్రధాని మోడీ నాకేమైనా మేనమామనా ? ఆయనను నేనెందుకు ద్వేషిస్తాను - సినీ నటుడు ప్రకాశ్ రాజ్
Prakash Raj : తాను ఒక పన్ను చెల్లింపు దారుడిని మాత్రమే అని సినీ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ (Prime minister narendra modi)పై తనకు ఎలాంటి ద్వేషమూ లేదని తెలిపారు. ప్రధాని పదవిలో ఎవరు ఉన్నా తాను ప్రశ్నిస్తూనే ఉంటానని చెప్పారు. కేరళ లిటరేచర్ ఫెస్టివల్ (Kerala Literature Festival- KLF)పాల్గొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Prakash Raj : 2024 లోక్ సభ ఎన్నికల్లో తనను పోటీ చేయాలని మూడు పార్టీలు వెంట పడుతున్నాయని సినీ నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. అయితే ఈ పార్టీలేవీ తన సిద్ధాంతాల కోసం రావడం లేదని, కేవలం ప్రధాని మోడీని విమర్శించడం వల్లే అలా కోరుతున్నాయని తెలిపారు. కానీ తాను వాటి ఉచ్చులో పడదలుచుకోలేదని స్పష్టం చేశారు. ఆదివారం కేరళలో నిర్వహించిన కేరళ లిటరేచర్ ఫెస్టివల్ (కేఎల్ఎఫ్)లో ఆయన పాల్గొని మాట్లాడారు.
విషాదం.. మాంజా దారం మెడకు చుట్టుకుని ఆర్మీ జవాను మృతి
ఈ సందర్భంగా సెషన్ మోడరేటర్ అంజనా శంకర్ అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం రాజకీయ పార్టీలు తమ స్వరాన్ని కోల్పోయాయని ప్రకాశ్ రాజ్ అన్నారు. వాటిలో నిజం లేదని, అందుకే చాలా పార్టీలు అభ్యర్థులను వెతికేందుకు కష్టపడుతున్నాయని ఆరోపించారు. తన వెంట మూడు రాజకీయ పార్టీలు పడుతున్నాయని, అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశానని చెప్పారు.
ప్రధాని మోడీని ద్వేషిస్తున్నారా అని అంజనా శంకర్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. ‘‘నేను ఆయనను (మోడీని) ఎందుకు ద్వేషిస్తాను. ఆయన నా మామనా ? లేక ఆయనతో నాకేమైనా ఆస్తి సమస్యలున్నాయా ? నేను ఒక పన్ను చెల్లింపుదారుడిని మాత్రమే అని స్పష్టంగా చెబుతున్నా.. ’’ అని ఆయన అన్నారు.
మార్చి 15 వరకు బలగాలను వెనక్కి తీసుకోండి - భారత్ కు మాల్దీవుల అల్టీమేటం..
ప్రభుత్వాన్ని విమర్శిస్తూ 'ఎక్స్' (ట్విట్టర్)లో ఆయన చేసిన పోస్టులను సమర్థించుకుంటూ ప్రకాశ్ రాజ్ ఇలా అన్నారు. ‘‘నేను ప్రతీ ఒక్కరి హృదయంలో ఉన్నదాన్ని మాట్లాడతాను. అది నా గొంతు కాదు. అది మా (ప్రజల) గొంతు. అది నా 'మన్ కీ బాత్' కాదు. మా మన్ కీ బాత్’’ అని తెలిపారు. అధికారంలో ఉన్న వ్యక్తిని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
తాను మోడీకి ఓటు వేసినా, వేయకపోయినా ఆయన తనకు ప్రధాని అని ప్రకాశ్ రాజ్ అన్నారు. ఇది ప్రజాస్వామ్యం అని, ఎవరూ ఓటు వేయలేదని చెప్పలేరని, ఎవరూ అడగలేరని అన్నారు. ప్రధాని పదవిలో ఎవరు కూర్చున్నా.. తాను ప్రశ్నిస్తానని అన్నారు. మోడీ పదవిలో నుంచి దిగిపోయిన తరువాత ఆయన గురించి తాను ఎందుకు మాట్లాడుతానని అన్నారు. ‘‘నెహ్రూ, హిట్లర్ గురించి నేను ఎప్పుడైనా ట్వీట్ చేస్తానా ? అవి నాకు సంబంధించినవి కూడా కావు. అలాగే ఔరంగజేబు, టిప్పు సుల్తాన్ లేదా ఇంకెవరి గురించైనా నేను మాట్లాడితే ప్రజలను నన్ను మూర్జుడు అని పిలుస్తారు. ఎందుకంటే వాళ్లు ఎనిమిది తరాల కిందటి వాళ్లు. అప్పుడు నేను పుట్టలేదు’’ అని ప్రకాశ్ రాజ్ అన్నారు.
ప్రభుత్వాన్ని కూలగొట్టే ధైర్యం బీఆర్ఎస్ కు లేదు - మంత్రి పొన్నం ప్రభాకర్
కాగా... 2019 సార్వత్రిక ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ప్రకాశ్ రాజ్..కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తరచూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తుంటారు. ఈ కేరళ లిటరేచర్ ఫెస్టివల్ కు చరిత్రకారుడు విలియం డాల్రింపిల్, నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, అమెరికన్ వైద్యుడు-రచయిత అబ్రహాం వర్గీస్, అవార్డు గ్రహీత రచయిత పెరుమాళ్ మురుగన్, హాస్యనటుడు కనన్ గిల్ సహా 400 మంది ప్రముఖులు హాజరయ్యారు.