డెల్మిక్రాన్ పదం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఒకవైపు డెల్టా ముప్పు తగ్గక ముందే ఒమిక్రాన్ వేరియంట్ పంజా విసరడంతో మరోసారి కకావికలం అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఈ తరుణంలో డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ల రెండు స్పైక్ ప్రోటీన్‌లతో కొత్త వేరియంట్ డెల్మిక్రాన్ ఉన్నదని, ఇప్పటికే అమెరికా, యూరప్ దేశాల్లో డెల్మిక్రాన్ కొత్త వేవ్‌లను సృష్టిస్తున్నదనేది ప్రచారం జరుగుతున్నది. ఈ ప్రచారం ఉత్త ప్రచారమే. ఇందులో వాస్తవం లేదు.
న్యూఢిల్లీ: ఈ మధ్య డెల్మిక్రాన్(Delmicron) పేరు ఎక్కువగా వినిపిస్తున్నది. ఇది కరోనా వైరస్(Coronavirus) కొత్త వేరియంట్(New Variant) అనే చర్చ జరుగుతున్నది. డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్‌లు రెండు కలిసి ఈ వేరియంట్ ఏర్పడిందని కొందరు చెబుతున్నారు. డెల్టా, ఒమిక్రాన్ రెండు స్పైక్ ప్రోటీన్‌లను కలిగి ఉన్నదే డెల్మిక్రాన్ వేరియంట్ అని పేర్కొంటున్నారు. అసలే.. ఒమిక్రాన్ భయాలు వణికిస్తుంటే డెల్మిక్రాన్ వేరియంట్ నిజంగానే ఉన్నదా? ఇది అసలు కరోనా వేరియంటేనా? దీని మీద చర్చ ఎందుకు మొదలైందో తెలుసుకుందాం.
క్లుప్తంగా చెప్పాలంటే డెల్మిక్రాన్ పేరిట కరోనా వైరస్ వేరియంటే లేదు. ఇప్పటి వరకు లేటెస్ట్ మ్యుటేషన్.. ఒమిక్రాన్ వేరియంటే. ఒమిక్రాన్ వేరియంట్ తర్వాత వైరస్ ఇప్పుడు మరో ఉత్పరివర్తనం చెందుతుందనే విషయాలు ఇప్పటి వరకు అయితే రాలేవు. ఒమిక్రాన్ వేరియంట్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ నవంబర్‌లో ఆందోళనకారక వేరియంట్‌గా ధ్రువీకరించింది. కాగా, డెల్మిక్రాన్ గురించి డబ్ల్యూహెచ్‌వో ఇది వరకు చర్చించలేదు. అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. మన దేశంలోని ఉన్నత సంస్థలు ఐసీఎంఆర్, నేషనల్ టాస్క్ ఫోర్స్ ఫర్ కొవిడ్ కూడా డెల్మిక్రాన్‌ను పట్టించుకోలేదు. డెల్మిక్రాన్ వేరియంట్ బూటకమని చెప్పడానికి మరో బలమైన ఆధారం ఉన్నది.
Also Read: 300 దాటిన ఒమిక్రాన్ కేసులు.. సమీక్ష సమావేశంలో ప్రధాని మోడీ వ్యాఖ్యలివే
సాధారణంగా కరోనా వేరియంట్లు అన్నింటికీ ఇప్పటి వరకు పేర్లు గ్రీక్ అక్షరమాల నుంచి ఎంచుకుని డబ్ల్యూహెచ్‌వో పెడుతున్నది. గ్రీన్ లెటర్స్‌లో డెల్మిక్రాన్ అనే పదమే లేదు. ఒక వేళ ఒమిక్రాన్ తర్వాత మరో వేరియంట్ వస్తే.. దాని పేరు పై, రో, సిగ్మా.. ఇలా ఉంటాయి. అలాంటప్పుడు ఈ నకిలీ వేరియంట్ ఎందుకు చర్చనీయాంశం అయిందంటే.. మహారాష్ట్ర కొవిడ్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు డాక్టర్ శశాంక్ జోషితో ఈ పదం హైలైట్ అయింది. డెల్టా, ఒమిక్రాన్ రెండు స్పైక్ ప్రోటీన్‌లున్న డెల్మిక్రాన్ కారణంగా అమెరికా, యూరప్ దేశాల్లో చిన్నపాటి తుఫానే వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే, ఆ వ్యాఖ్య తర్వాత మీడియాలో విరివిగా కనిపించిన డెల్మిక్రాన్ అర్థం.. డాక్టర్ శశాంక్ జోషి ఉపయోగించిన అర్థానికి భిన్నంగా ఉన్నది. డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ల కారణంగా అమెరికా, యూరప్ దేశాల్లో కేసులు బద్ధలవుతున్నాయి. అంతేకానీ, ఆయన ఈ రెండు స్పైక్ ప్రోటీన్‌లతో కొత్త రకం వేరియంట్ అని ఆయన చెప్పలేదు. కాబట్టి, డెల్మిక్రాన్ అనేది కొత్త వేరియంట్ కాదు.
Also Read: Omicron: అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయండి.. ప్రధాని, ఈసీకి అలహాబాద్ హైకోర్టు సూచనలు
దేశంలో ఒమిక్రాన్(Omicron Variant) కేసులు పెరుగుతున్నాయి. తాజాగా, తమిళనాడు ఒక్కసారిగా 33 మందిలో ఒమిక్రాన్ వేరియంట్ ఉన్నట్టు తేలింది. తెలంగాణలోనూ కొత్తగా 14 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. కేరళ, కర్ణాటకల్లోనూ కొత్త ఒమిక్రాన్ కేసులు రిపోర్ట్ అయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు 300 మార్క్‌ను దాటేశాయి. కరోనా కేసులు భారీగా రిపోర్ట్ అవుతున్నాయి. కేవలం ముంబయి మహానగరంలోనే సింగిల్ డేలో 602 కొత్త కేసులు నమోదయ్యాయి. అక్టోబర్ 6వ తేదీ తర్వాత మళ్లీ ఈ స్థాయిలో కొత్త కేసులు రిపోర్ట్ కావడం ఇదే తొలిసారి. ఇలాంటి వార్తలు దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆందోళనలను రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కరోనా పరిస్థితులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(PM Modi) నేడు సాయంత్రం ఉన్నత అధికారులతో సమావేశం(Review Meeting) అయ్యారు.
