ఒమిక్రాన్ వేరియంట్ ముప్పు పొంచి ఉన్న తరుణంలో వచ్చే ఏడాది తొలినాళ్లలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఆందోళనలను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అసెంబ్లీ ఎన్నికలను మరో నెల లేదా రెండు నెలలు వాయిదా వేసే ఆలోచనలు చేయాలని తెలిపింది. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి, ఎన్నికల సంఘానికి సూచనలు చేసింది. అంతేకాదు, ర్యాలీలు, బహిరంగ సభలు, రాజకీయ వేడుకలపైనా నిషేధం విధించాలని తెలిపింది.

లక్నో: సెకండ్ వేవ్ ముగిసిన తర్వాత మళ్లీ దేశంలో కరోనా కేసులు(Corona Cases) మెల్లిగా పెరుగుతున్నాయి. డెల్టా వేరియంట్(Delta Variant) వేగంగా వ్యాపించడంతో దేశంలో వచ్చిన సెకండ్ వేవ్ విలయం సృష్టించింది. ఇప్పుడు డెల్టా కంటే వేగంగా సంక్రమించే ఒమిక్రాన్ వేరియంట్(Omicron Variant) కూడా దేశంలో చాప కింది నీరులా వేగంగా వ్యాపిస్తున్నది. దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఇప్పుడు 300 మార్క్ దాటాయి. మహమ్మారి ముప్పు ఇలా పొంచి ఉండగా వచ్చే ఏడాది తొలినాళ్లలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం రాజకీయ పార్టీల ర్యాలీలు, కార్యక్రమాలు, ప్రచారాలు, ఎన్నికల తంతు మొత్తం కూడా కరోనా ముప్పును మరింత పెంచే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలోనే అలహాబాద్ హైకోర్టు(Allahabad High Court) కీలక వ్యాఖ్యలు చేసింది.

కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ ముప్పు కారణంగా రానున్న అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసే ఆలోచనలు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి, ఎన్నికల సంఘానికి అలహాబాద్ హైకోర్టు సూచనలు చేసింది. కరోనా ముప్పు పొంచి ఉన్నందున ఈ అసెంబ్లీ ఎన్నికలను మరో నెల లేదా.. రెండు నెలలు వాయిదా వేయాలని సూచించింది. కరోనా కేసులు పెరగకుండా.. మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యలు తీసుకోవాలని కేంద్రానికి తెలిపింది. అలాగే, ర్యాలీలు, రాజకీయ సభలు, కార్యక్రమాలపై నిషేధం విధించాలనీ సూచించింది. ఎన్నికల కోసం ప్రచారం చేయాలనుకుంటే రాజకీయ పార్టీలు టీవీలు, న్యూస్ పేపర్లనూ ఎంచుకోవచ్చని తెలిపింది. ప్రాణాలు ఉంటేనే మిగతా అంతా కూడా అంటూ అలహాబాద్ హైకోర్టు.. ఈ అంశాలు పరిగణనలోకి తీసుకోవాలని ప్రధాని మోడీకి, ఎన్నికల కమిషన్‌ను కోరింది.

Also Read: యూపీ ఎన్నికలకు ఒమిక్రాన్ ముప్పు? కరోనా కట్టడి చర్యల వివరాలు అడిగిన ఈసీ

ఈ సందర్భంగా అలహాబాద్ హైకోర్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించింది. భారీ జనాభా గల దేశంలో ఉచిత టీకా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాలు, కృషి అమోఘనీయమని తెలిపింది. ఈ విషయాలను ఓ బెయిల్ అప్లికేషన్‌పై వాదనలు వింటుండగా పేర్కొంది. జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ ఈ అంశాలను ప్రస్తావించారు. ఈ రోజు కోర్టులో 400 పిటిషన్లు విచారణకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఇందుకోసం చాలా లాయర్లు కోర్టుకు వచ్చారని చెప్పారు. ఇదే సమయంలో చాలా మంది లాయర్లు అంతా భౌతిక దూరాన్ని పాటించడంలో, మాస్కు ధరించే నిబంధనను అమలు చేయడంలో విఫలం అయ్యారని పేర్కొన్నారు.

Also Read: ఆ ఊరు తీరే వేరు.. గ్రామ సర్పంచ్ పదవికి వేలంపాట.. ఎక్కువ పాడిన వారే సర్పంచ్

ఒమిక్రాన్ విజృంభిస్తే.. జనవరి లేదా ఫిబ్రవరిల్లో వేవ్ పీక్ స్టేజ్‌లో ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో కరోనా కట్టడికి ఉత్తరప్రదేశ్ తీసుకుంటున్న చర్యలు వెల్లడించాల్సిందిగా ఎన్నికల కమిషన్ ఇటీవలే ఆదేశించింది. యూపీలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో తెలపాల్సిందిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. టీకా పంపిణీ వివరాలను వెల్డించాల్సిందిగా పేర్కొంది. అలాగే, రాష్ట్రంలో ఎన్ని కన్ఫామ్‌డ్ కేసులు ఉన్నాయో వివరించాలని ఆదేశించింది. ఉత్తరప్రదేశ్‌తోపాటు మరో నాలుగు రాష్ట్రాలకు వచ్చే ఏడాది తొలినాళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నది. ఈ ఎన్నికల తుది తేదీలను ఎలక్షన్ కమిషన్ జనవరి మూడో వారంలో వెలువరించవచ్చు. జనవరి నుంచి మార్చి మధ్యలో ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నది.