ఇద్దరు వైద్యులు చేసిన మోసం ఒక నిండు గర్భవతి ప్రాణాలను ప్రమాదంలో పడేసింది. తమిళనాడులోని కుంభకోణం సమీపంలోని గోవిందపురానికి చెందిన శశికళ ఓ రోజు జ్వరంతో బాధపడుతూ.. కుంభకోణం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. అక్కడి నర్సులు ఆమెకు ఇంజెక్షన్ చేస్తుండగా అనుకోకుండా సూది విరిగిపోయింది. దీనిని నర్సులు  కానీ బాధితురాలు కానీ గుర్తించలేదు.. ఇంటికి వెళ్లిన ఆమెకు రెండు రోజుల తర్వాత చేతి వద్ద భరించలేనంత నొప్పి వచ్చింది..

బాధ మరింత ఎక్కువవతుండటంతో తిరిగి ఆసుపత్రికి  వచ్చిన శశికళకు వైద్యులు ఎక్స్‌రే తీసి చేతిలో సూది ముక్క ఉన్నట్లు చెప్పారు. దీంతో తంజావూరు వైద్య కళాశాలలో ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించి సూది ముక్కను తొలగించినట్లు చెప్పారు..

కొద్దిరోజులు బాగానే ఉన్నప్పటికీ.. నిన్న ఉన్నట్లుండి గుండె నొప్పి రావడంతో సమీపంలోని వైద్యుడి వద్దకు వెళ్లింది. అక్కడ మరోమారు ఎక్స్‌రే తీయగా గుండెకు సమీపంలో సూది ముక్క కనిపించడంతో దిగ్భ్రాంతికి గురైంది. ఇంజక్షన్ చేసిన నర్సులు... సూది ముక్కను తీశామని చెప్పిన వైద్యులు అంతా  తమను  మోసం  చేశారని శశికళ కన్నీరుమున్నీరైంది.. వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తోంది. మరోవైపు ప్రస్తుతం బాధితురాలు మూడు నెలల గర్భవతి.