ప్రపంచవ్యాప్తంగా కోరలు చాస్తోన్న కరోనా వైరస్ భారతదేశంలోనూ అంతే వేగంగా వ్యాప్తిస్తోంది. ప్రభుత్వం ఎక్కడికక్కడే కట్టుదిట్టంగా వ్యవహరిస్తోన్నప్పటికీ వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది.

భారత్‌లో ఇప్పటి వరకు 415 మంది కరోనా పాజిటివ్‌గా తేలగా, ఏడుగురు మరణించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే మహారాష్ట్రలో దీని వ్యాప్తి అధికంగా ఉంది. తాజాగా పూణేలో ఇన్ఫోసిస్ కంపెనీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా తేలింది.

Also Read:తెలంగాణలో 33కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు: 3 కాంటాక్ట్ కేసులు

కొన్నిరోజుల క్రితం ఈమె కరోనా నిర్థారణ అయిన అంగన్‌వాడీ కార్యకర్తతో సన్నిహితంగా మెలిగినట్లు గుర్తించారు. ఆ తర్వాత కొద్దిరోజులకే మహిళా టెక్కీకి కూడా కరోనా పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు తెలిపారు.

దీంతో అప్రమత్తమైన ఇన్ఫోసిస్, రాజీవ్ గాంధీ ఇన్ఫోటెక్ పార్క్‌లో తమ కార్యాలయాన్ని పూర్తిగా శానిటైజ్ చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ఇదే విషయాన్ని ఆదివారం నాడు ప్రతి ఉద్యోగికి ఈ మెయిల్ ద్వారా తెలియజేశామని ఇన్ఫోసిస్ తెలిపింది.

Also Read:కోల్ కతాలో 55 ఏళ్ల వ్యక్తి మృతి: దేశంలో 9కి చేరిన మృతుల సంఖ్య

అంతేకాకుండా ఆ ఉద్యోగినితో సన్నిహితంగా మెలిగిన వారందరినీ 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాల్సిందిగా ఆదేశించింది. ఈ విపత్కర పరిస్ధితుల్లో అధికారులతో కలిసి పనిచేస్తున్నామని ఇన్ఫోసిస్ తెలిపింది. అయితే కరోనా వైరస్ ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా బెంగళూరులోని ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో శిక్షణలో ఉన్న దాదాపు 8 వేల మందిని తమ ఇంటికి వెళ్లాలని సూచించింది.