హైదరాబాద్: తెలంగాణ కరోనా వైరస్ కేసుల సంఖ్య 33కు చేరుకుంది. ఇందులో మూడు కాంటాక్ట్ కేసులు కావడం గమనార్హహం. కరీంనగర్ లో కరోనా రెండో దశకు చేరుకుంది. ఈ రోజు ఒక్క రోజే ఆరు కేసులు బయటపడ్డాయి. కరోనా వైరస్ తో ఒక్కరు కూడా తెలంగాణలో చనిపోలేదని ఈటెల రాజేందర్ చెప్పారు. ఒక్కరు కూడా వెంటిలేటర్ మీద లేరని ఆయన చెప్పారు. ఒకరిని డిశ్చార్జీ చేశామని, ఒకటి రెండు రోజుల్లో మరింత మందిని డిశ్చార్జీ చేస్తామని చెప్పారు. 

గాంధీ, కింగ్ కోఠీ, చెస్ట్, ఫీవర్ ఆస్పత్రుల్లో ఓపీ సేవలను నిలిపేశారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కరోనా చికిత్సకు మద్దతు ప్రకటించాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలతో సోమవారం ఈటెల రాజేందర్ సమావేశమయ్యారు.నిరోధక చర్యలను ఫీవర్ ఆస్పత్రిలో ఎక్కువగా చేయాలని నిర్ణయించామని చెప్పారు. ముందు జాగ్రత్తలో భాగంగానే షట్ డౌన్ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 

తెలంగాణలో అసాధారణమైన నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్త పరిణామాలను అర్థం చేసుకుని బతికుంటే బలుసాకు తినవచ్చునని, ఆర్థికంగా నష్టపోతున్నా లెక్క చేయకుండా 31వ తేదీ వరకు ఇళ్లలోనే ఉండాలని ఆయన చెప్పారు.

ప్రజలు, ప్రభుత్వం అందరం కలిసి పోరాడితేనే కరోనా వైరస్‌ను అరికట్టగలమన్నారు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. హైదరాబాద్ కోఠి కమాండ్ సెంటర్‌లో ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలతో ఆయన సోమవారం సమావేశం నిర్వహించారు.

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి రెండో దశకు చేరుకోవడం వల్లే లాక్‌డౌన్ ప్రకటించి కఠిన నిబంధనలు అమలు చేస్తున్నామని ఈటల చెప్పారు. పాజిటివ్ కేసులు పెరుగుతున్నందునే ప్రైవేట్ కాలేజీల్లోని ఐసీయూ, ఐసోలేషన్ బెడ్లను అందుబాటులో ఉంచాలని ఆయన కోరారు.

అత్యవసర పరిస్ధితి ఎదురైతే పేషంట్లను అడ్మిట్ చేసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. వైరస్ వ్యాప్తి మూడో దశకు చేరుకుంటే మరిన్ని ఇబ్బందులు తప్పవని, అందుకే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని ఈటల రాజేందర్ చెప్పారు.