భారత్-పాకిస్తాన్ వివాదంతో అమెరికాకు సంబంధం లేదని... దౌత్యం ద్వారానే ఇరువదేశాలు ఉద్రిక్తతను తగ్గించుకోవాలని అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ సూచించారు.
భారత్-పాకిస్తాన్ వివాదంపై అమెరికా తటస్థంగా ఉండేందుకు సిద్దమయ్యింది. తాము ఏ దేశాన్ని నియంత్రించడం లేదని.. ఈ వివాదానికి అమెరికాకు సంబంధమే లేదన్నారు. ఉద్రిక్తతను తగ్గించుకోవాలని మాత్రమే ఇరు దేశాలను అమెరికా కోరగలదు... కానీ ఈ వివాదంలో జోక్యం చేసుకోలేమని వాన్స్ స్పష్టం చేసారు.
"ముందునుండే భారత్‌కు పాకిస్తాన్‌తో విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు అవి తాారాస్థాయికి చేరుకున్నాయి. ఈ సమయంలో మనం చేయగలిగిందల్లా ఈ దేశాలను ఉద్రిక్తతను తగ్గించుకోవాలని ప్రోత్సహించడమే. అంతేగానీ మనం ఈ వివాదంలో జోక్యం చేసుకోబోము. ఇది ప్రాథమికంగా మన వ్యవహారం కాదు మరియు దీనిని నియంత్రించడంలో అమెరికా పాత్ర లేదు" అని ఆయన ఫాక్స్ న్యూస్‌తో అన్నారు.
"అణ్వాయుధ దేశాల మధ్య ఘర్షణ జరిగే అవకాశం గురించి మేము ఆందోళన చెందుతున్నాము. సెక్రటరీ రూబియో మరియు అధ్యక్షుడు ట్రంప్ చెప్పినట్లుగా ఈ ఉద్రిక్తత వీలైనంత త్వరగా తగ్గాలని మేము కోరుకుంటున్నాము. అయితే,మనం ఈ దేశాలను నియంత్రించలేము" అని వాన్స్ తెలిపారు.
ఉద్రిక్తతను నివారించడానికి దౌత్య మార్గాలపై ఆధారపడాలని సూచించామని.. ఏ దేశాన్నీ ఆపమని అమెరికా బలవంతం చేయలేదని ఆయన నొక్కి చెప్పారు."భారతీయులు లేదా పాకిస్తానీయులు ఆయుధాలు వదులుకోమని అమెరికా చెప్పలేదు. కాబట్టి మేము దౌత్య మార్గాల ద్వారా ఈ విషయాన్ని కొనసాగిస్తాము. ఇది విస్తృత ప్రాంతీయ యుద్ధంగా మారకుంటే మంచిది. అణు యుద్ధంగా మారదని మా ఆశ మరియు అంచనా" అని వాన్స్ అన్నారు.
ఇదిలా ఉండగా భారత్ మరియు పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పరిస్థితి మరింత దిగజారకుండా చూసుకోవడంపై విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో దృష్టిపెట్టారని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి టామీ బ్రూస్ అన్నారు. శాంతిని నెలకొల్పడానికి అమెరికా ఇరు దేశాలతో చురుకుగా సంప్రదింపులు జరుపుతోందని బ్రూస్ అన్నారు.


