పాలస్తీనాపై కేంద్ర ప్రభుత్వ తొలి స్పందన.. స్వతంత్ర దేశ ఏర్పాటుకు మద్దతు: విదేశాంగ శాఖ కీలక వ్యాఖ్యలు
పాలస్తీనాపై కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా స్పందించింది. ఇజ్రాయెల్‌తో అంతర్జాతీయంగా గుర్తించే సరిహద్దును పంచుకుంటూ శాంతియుతంగా మెలిగే స్వతంత్ర, సార్వభౌమ పాలస్తీనా దేశ స్థాపనను భారత్ ఎప్పటిలాగే కోరుకుంటున్నదని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి వెల్లడించారు.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తొలిసారి పాలస్తీనాపై స్పందించింది. భారత్ సుదీర్ఘంగా అవలంభిస్తున్న వైఖరికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నదని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. స్వతంత్ర, సార్వభౌమ పాలస్తీనా దేశ స్థాపనకు తమ మద్దతు ఎప్పటిలాగే ఉంటుందని వివరించారు.
‘మా వైఖరి సుదీర్ఘమైనది, సుస్థిరమైనది. స్వతంత్ర, సార్వభౌమ, సుస్థిరంగా నిలబడేలా పాలస్తీనా దేశ స్థాపన కోసం ప్రత్యక్ష సంప్రదింపులను భారత్ కోరుకుంటుంది. ఇజ్రాయెల్‌తో సరిహద్దును పంచుకుంటూనే సుస్థిరంగా, సురక్షితంగా జీవించేలా ఆ దేశం ఉండాలని, ఇజ్రాయెల్‌తో పొరుగునే శాంతియుతంగా ఉండాలని కోరుకుంటున్నది. ఎప్పటిలాగే ఈ భారత వైఖరిలో మార్పు లేదు’ అని అరిందమ్ బాగ్చి తెలిపారు.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం మొదలయ్యాక భారత్ నుంచి పాలస్తీనాపై వెలువడిన తొలి స్పందన ఇది. ఇజ్రాయెల్ పై భారత్ రెండు సార్లు స్పందించింది. రెండు సార్లూ హమాస్ దాడిని ఉగ్రవాద దాడిగా పేర్కొంటూ ప్రధాని మోడీ ఖండించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో ప్రధాని మోడీ మాట్లాడుతూ ఆ దేశానికి మద్దతు పలికారు.
భారత్ సుదీర్ఘకాలంగా పాలస్తీనా వైపు నిలబడింది. ఇటీవలే అంతర్జాతీయ రాజకీయాలు, అధికారాల్లో జరిగిన మార్పుల దృష్ట్యా మన దౌత్య విధానంలోనూ కొంత మార్పు వచ్చింది. ఇజ్రాయెల్ వైపు భారత్ నిలబడుతున్నది.
Also Read: సిరియా విమానాశ్రయాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. టార్గెట్ ఇరాన్?
హమాస్ చేసిన దాడిని ఖండిస్తూ పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశాలతో సమతూకంగా వ్యవహరించాలని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. పాలస్తీనా ప్రజల హక్కుల కోసమూ గళం విప్పుతూనే ఇజ్రాయెల్ దేశ భద్రతాపరమైన, ఇతర అవసరాలపై చర్చ చేయాలని పేర్కొన్నారు.