సిరియా విమానాశ్రయాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. టార్గెట్ ఇరాన్?

సిరియా రాజధాని డమస్కస్, ఉత్తర నగరం అలెప్పోల్లోని అంతర్జాతీయ విమానాశ్రయాలపై ఇజ్రాయెల్ గగనతల దాడులకు పాల్పడింది. ఇరాన్ మంత్రి సిరియా పర్యటించడానికి ఒక రోజు ముందే ఈ దాడి జరగడం గమనార్హం.
 

israel attacks on syrian two international airports kms

న్యూఢిల్లీ: సిరియాలోని రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. గురువారం ఈ గగనతల దాడులు జరిగినట్టు సిరియా వెల్లడించింది. ఆ తర్వాతే ఇజ్రాయెల్‌కు చెందిన చానెల్ 12 కూడా ఈ దాడులను ధ్రువీకరించింది. ఒక వైపు గాజా పట్టిలోని హమాస్ పై యుద్ధం చేస్తూనే మరో వైపు సిరియాపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. సిరియా రాజధాని డమస్కస్‌లోని ఎయిర్‌పోర్టు, ఉత్తరం వైపున ఉండే అలెప్పోలోని విమానాశ్రయంపై ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ప్రాణ నష్టం గురించిన వివరాలు ఇంకా అందలేవు.

సిరియా అధికారిక వార్తా ఏజెన్సీ సనా.. సిరియా మిలిటరీ వర్గాల స్పందనను రిపోర్ట్ చేసింది. గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న నేరాల నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ దాడికి పాల్పడిందని సిరియా మిలిటరీ వర్గాలు తెలిపాయి. పాలస్తీనా తిరుగుబాటుదారుల చేతిలో భారీ నష్టాన్ని మూటగట్టుకోవడం నుంచి చూపులు మరల్చేందుకు ఈ గగనతల దాడులకు పాల్పడిందని ఆరోపించాయి. సిరియా ప్రభుత్వం తమ దేశంలోని ఉత్తర ప్రాంతంలో ఉగ్రవాదులతో పోరాడుతున్నదని, ఇజ్రాయెల్ దాడులు ఆ ఉగ్రవాదులకు అనుకూలంగా ఉన్నాయని ఆరోపణలు గుప్పించాయి.

ఇరాన్ మంత్రి విదేశాంగ మంత్రి హొస్సెన్ అమిర్ అబ్దొల్లాహియన్ సిరియా పర్యటించడానికి ఒక రోజు ముందే ఈ దాడి జరగడం గమనార్హం. ఇరాన్‌కు చెందిన మహన్ ఎయిర్ ఫ్లైట్ ఈ దాడులు జరిగిన సమయంలో సిరియా విమానాశ్రయాల్లో ల్యాండ్ కావాల్సి ఉన్నదని, కానీ, ఈ దాడుల కారణంగా ఆ విమానాలు తిరిగి టెహ్రాన్‌కు వెళ్లిపోయాయని తెలిసింది. దీంతో సిరియాపై ఇజ్రాయెల్ దాడులు ఇరాన్ టార్గెట్‌గా జరిగినవేనా? అనే అనుమానాలు వస్తున్నాయి.

Also Read : అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించిన ఆ రెండు గ్రామాలు.. ‘ ఇప్పటికీ కనీస వసతులు లేవు ’

సిరియాలోని బషర్ అల్ అసద్ ప్రభుత్వం ఆ దేశంలోని ఉత్తరప్రాంతంలోని తీవ్రవాదులతో పోరాడుతున్నది. 2011లో మొదలైన అంతర్యుద్ధంలో ఇరాన్ ప్రభుత్వం బషర్ అల్ అసద్‌కు మద్దతు ఇస్తున్నది. అప్పటి నుంచి సిరియాలో ఇరాన్ ప్రభావం పెరుగుతూ వస్తున్నది. సిరియాలో ఇరాన్ ప్రభావం పెరగడం ఇజ్రాయెల్‌కు ఇష్టం లేదు. ఇరాన్ ఒక రకంగా ఇజ్రాయెల్‌కు శత్రువు. ఇజ్రాయెల్ పై హమాస్ చేసిన దాడిని ఇరాన్ వేడుక చేసుకుంది కూడా. అయితే.. హమాస్ దాడిలో తమ పాత్ర లేదని చెప్పిన సంగతి తెలిసిందే.

సిరియాలో ఇలా ఇజ్రాయెల్ చాలా సార్లు దాడులు చేసింది. చాలా సార్లు ఆ దాడులపై కనీసం స్పందించదు కూడా. ఇరాన్‌కు సంబంధించిన శక్తులే టార్గెట్‌గా దాడులు జరుపుతున్నట్టు సాధారణంగా ఇజ్రాయెల్ చెబుతుంటుంది. అయితే.. తాజాగా దాడిపై జెరూసలేం పోస్టు ఓ వార్తను ప్రచురించింది.

సిరియా సరిహద్దు నుంచి గురువారం రాత్రి ఇజ్రాయెల్‌లోకి షెల్స్ ఫైర్ చేశారని జెరూసలేం పోస్టు ఓ కథనంలో రిపోర్ట్ చేసింది. ఇజ్రాయెల్‌లో గోలాన్ హెయిట్స్‌లో బహిరంగ ప్రదేశాల్లో ఈ షెల్స్ పడ్డాయని తెలిపింది. ఈ దాడికి ప్రతిగానే సిరియాపై ఇజ్రాయెల్ గగనతల దాడులకు పాల్పడిందని వివరించింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios