‘ఫ్రెండ్’ కోసం పాకిస్తాన్ వెళ్లిన భారత మహిళ.. పాక్ అధికారులకు ఆ యువకుడు ఏమని చెప్పాడంటే?
ఓ పాకిస్తాన్ ఫేస్‌బుక్ ఫ్రెండ్ కోసం భారత్ నుంచి ఓ మహిళ వెళ్లిపోయింది. భారత్ నుంచి మహిళ రావడంపై పాకిస్తాన్ ప్రభుత్వం వివరణ కోరగా.. ఆ యువకుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తమది స్నేహం మాత్రమేనని, అందులో ప్రేమ వ్యవహారం లేదని, ఆమెను పెళ్లి చేసుకోవడం లేదని స్పష్టం చేశారు.

న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ఎల్లలు లేనిది. దేశ సరిహద్దులు దాటి పరిచయాలకు వేదికవుతున్నది. ఇలా స్నేహం చేసుకునే దేశాలు దాటి మిత్రులను కలవడానికి వెళ్లుతున్నారు. ఇలాంటి స్నేహంతోనే పాకిస్తాన్‌కు చెందిన సీమా హైదర్ భారత్‌లోని ప్రియుడిని కలవడానికి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా, భారత్ నుంచి ఓ మహిళ పాకిస్తాన్‌కు తన ఫేస్‌బుక్ ఫ్రెండ్‌ను కలవడానికి వెళ్లింది. రాజస్తాన్‌లోని అళ్వార్ జిల్లా భీవడిలో నివసిస్తున్న 34 ఏళ్ల అంజు ఇద్దరు పిల్లలు, భర్తను వదిలిపెట్టి పాకిస్తాన్ ఖైబర పక్తుంక్వాలోని 29 ఏళ్ల నస్రుల్లాను కలవడానికి వెళ్లిపోయింది.
జైపూర్‌కు వెళ్లుతున్నానని, కొన్ని రోజుల తర్వాత మళ్లీ వస్తానని చెప్పి బయల్దేరిన అంజు అటు నుంచి అటే వెళ్లిపోయింది. మీడియా ద్వారా ఆదివారం ఈ విషయం అంజు భర్త అర్వింద్‌కు తెలిసింది. తన భర్త తిరిగి వస్తుందనే ఆయన ఎదురుచూస్తున్నారు.
అంజు పాకిస్తాన్‌కు రావడంపై పాకిస్తాన్ అధికారులు నస్రుల్లా నుంచి వివరణ కోరారు. దీనికి ఆయన ప్రభుత్వ వర్గాలకు ఓ అఫిడవిట్ సమర్పించారు. ఇందులో ప్రేమ వ్యవహారం ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. అంజును పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదని వివరించారు. ఆమె తిరిగి స్వదేశం భారత్‌కు తిరిగి వెళ్లిపోతుందని పేర్కొన్నారు. వచ్చే నెల 20వ తేదీన ఆమె తిరిగి భారత్‌కు వెళ్లిపోతుందని వివరించారు. అంతేకాదు, తమది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమేనని తెలిపారు.
Also Read: పాకిస్తాన్‌లోని లవర్ కోసం బార్డర్ దాటిన మహిళ.. రాజస్తాన్ నుంచి పాక్.. వెళ్లాక భర్తకు ఏం చెప్పిందంటే?
ఈ విషయంపై అర్వింద్ స్పందించాడు. తన భార్య వాట్సాప్ ద్వారా టచ్‌లో ఉన్నదని వివరించాడు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఆమె తనకు ఫోన్ చేసినట్టు చెప్పాడు. తాను లాహోర్‌లో ఉన్నానని, మరో మూడు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పినట్టు ఆయన పేర్కొన్నాడు.
అర్వింద్, అంజులు భార్యభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. భీవడిలోని అద్దెకు ఒక ఫ్లాట్‌లో ఈ దంపతులు అంజు సోదరుడితో కలిసి ఉంటున్నారు. అర్వింద్ భీవడిలోనే పని చేస్తున్నారు. అంజు బయోడేటా ఎంట్రీ ఆపరేటర్‌గా ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నది. అబ్రాడ్‌లో జాబ్ చేయాలని 2020లోనే ఆమె పాస్‌పోర్టు తీసుకుంది.