Asianet News TeluguAsianet News Telugu

73rd republic day: ఈ సారి బీటింగ్ రీట్రీట్‌‌ మరింత ప్రత్యేకంగా .. ఒకేసారి 1000 డ్రోన్లతో వెలుగుల షో

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఏటా నిర్వహించే బీటింగ్‌ రీట్రీట్‌లో ఈసారి డ్రోన్లతో లేజర్‌ వెలుగులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. తొలిసారిగా ఏకకాలంలో 1000 డ్రోన్లతో ఈనెల 29న విజయ్‌చౌక్‌లో జరగనున్న బీటింగ్‌ రీట్రీట్‌కు రిహార్సల్స్‌ కొనసాగుతున్నాయి

Indian StartUp Botlab to fly 1,000 Drones during Beating Retreat ceremony tomorrow evening
Author
New Delhi, First Published Jan 28, 2022, 5:43 PM IST

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఏటా నిర్వహించే బీటింగ్‌ రీట్రీట్‌లో ఈసారి డ్రోన్లతో లేజర్‌ వెలుగులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. తొలిసారిగా ఏకకాలంలో 1000 డ్రోన్లతో ఈనెల 29న విజయ్‌చౌక్‌లో జరగనున్న బీటింగ్‌ రీట్రీట్‌కు రిహార్సల్స్‌ కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా రాష్ట్రపతి భవన్‌ నిర్వహించిన డ్రోన్ల ప్రదర్శన ఆకట్టుకుంటోంది. ఆకాశంలోకి ఎగురుతున్న డ్రోన్లు.. లేజర్‌ వెలుగులను విరజిమ్ముతూ కనులవిందు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

కేంద్ర సైన్స్ & టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డ్ (TDB) నిధులతో..  IIT ఢిల్లీ పూర్వ విద్యార్థుల నేతృత్వంలో ఇండియన్ స్టార్టప్ "బోట్‌ల్యాబ్స్‌ డైనమిక్స్‌"ను ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ శుక్రవారం ప్రకటించారు. రిపబ్లిక్ డేకి సంబంధించి దాదాపు వారం రోజుల పాటు జరిగిన కార్యక్రమాల ముగింపు సందర్భంగా రేపు సాయంత్రం "బీటింగ్ రిట్రీట్" వేడుకలో 1,000 డ్రోన్‌లను ఎగురవేయనున్నట్లు తెలిపారు. తద్వారా చైనా, రష్యా, బ్రిటన్‌ల తర్వాత 1,000 డ్రోన్‌లతో ఇంత భారీ ప్రదర్శనను నిర్వహిస్తున్న నాలుగో దేశంగా భారత్‌ అవతరించనుంది. 

డ్రోన్ ప్రదర్శనకు సంబంధించి మంత్రి జితేంద్ర సింగ్ తన నివాసంలో "బాట్‌లాబ్" స్టార్టప్ టీమ్ సభ్యులు తన్మయ్ బంకర్, సరితా అహ్లావత్, సుజిత్ రాణా, మోహిత్ శర్మ, హర్షిత్ బాత్రా, కునాల్ మీనా తదితరులతో సంభాషించారు. Botlab Dynamics Private Limited మేనేజింగ్ డైరెక్టర్ ,  ఇంజనీర్లు ఒకేసారి 1,000 డ్రోన్‌లతో ఆకాశాన్ని వెలిగించిన తొలి సంస్థగా నిలవాలని పట్టుదలగా వున్నారని మంత్రి తెలిపారు. 

స్టార్ట్-అప్, బోట్‌ల్యాబ్ డైనమిక్స్‌కు డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ (డిఎస్‌టి) నుంచి కోటి రూపాయల ప్రారంభ సీడ్ ఫండ్‌ను అందజేసినట్లు వెల్లడించారు. ఆ తర్వాత టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డ్ ద్వారా స్కేల్ అప్ , వాణిజ్యీకరణకు రూ. 2.5 కోట్లు ఇచ్చామని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. భారతదేశాన్ని స్టార్ట్-అప్ ఎకోసిస్టమ్‌లో గ్లోబల్ హబ్‌గా మార్చాలనే ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షలకు అనుగుణంగా స్టార్టప్‌లకు మద్దతు ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

ప్రైవేట్ సెక్టార్ హార్డ్‌వేర్ స్టార్ట్‌అప్‌లపై విముఖత చూపుతున్న వేళ.. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అందించిన పూర్తి ఆర్థిక సహకారం వల్లనే డ్రోన్ ప్రాజెక్ట్ విజయవంతమైందని బోట్‌ల్యాబ్ డైనమిక్స్ ఎండి డాక్టర్ సరితా అహ్లావత్ పేర్కొన్నారు. లాభదాయకమైన MNCల ఆఫర్‌లను వదులుకుని.. ఈ ప్రాజెక్ట్‌ కోసం పనిచేసిన ఇంజనీర్‌లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. “3D కొరియోగ్రాఫ్డ్ డ్రోన్ లైట్ షోల కోసం 500-1000 డ్రోన్‌లతో కూడిన రీకాన్ఫిగరబుల్ స్వార్మింగ్ సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్” ప్రాజెక్ట్‌కి అన్నిరకాలుగా మద్దతు, ప్రోత్సాహం అందించినందుకు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్‌కి సరిత కృతజ్ఞతలు తెలిపారు.

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ... బోట్‌ల్యాబ్ డైనమిక్స్ 6 నెలల్లోనే ఫ్లీట్ 1000 స్వార్మ్ డ్రోన్‌లను అభివృద్ధి చేయగలిగిందన్నారు. ఫ్లైట్ కంట్రోలర్ (డ్రోన్ మెదడు) వంటి హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ రెండింటితో సహా అవసరమైన అన్ని భాగాల అభివృద్ధిని కలిగిన ప్రాజెక్ట్ దేశీయంగా అభివృద్ధి చేయబడటం గర్వంగా వుందన్నారు. బాట్‌ల్యాబ్ రక్షణ మంత్రిత్వ శాఖతో కలిసి 75వ స్వాతంత్ర్య సంవత్సరాన్ని పురస్కరించుకుని ‘డ్రోన్ షో’ అనే నవలను రూపొందించినట్లు జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ డ్రోన్ షో 10 నిమిషాల వ్యవధిలో ఉంటుందని , సృజనాత్మక నిర్మాణాల ద్వారా ఈ 75 ఏళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రదర్శిస్తుందని ఆయన చెప్పారు.

సీనియర్ అధికారుల నుండి MoD, DST TDB , IIT ఢిల్లీలోని అధికారి వరకు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కంపెనీకి మద్దతు ఇచ్చారని జితేంద్ర సింగ్ తెలిపారు. TDB భారతీయ పారిశ్రామిక రంగానికి వున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు ఏజెన్సీలకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని కేంద్రమంత్రి పేర్కొన్నారు. స్వదేశీ సాంకేతికతల అభివృద్ధి, వాణిజ్యానికి ప్రోత్సాహం, దిగుమతి చేసుకున్న సాంకేతికతలను విస్తృత దేశీయ అవసరాలకు అనుగుణంగా మార్చడం వంటి వాటిలో టీడీబీ కీలకపాత్ర పోషిస్తోందని జితేంద్ర సింగ్ చెప్పారు. 

టీడీబీ కార్యదర్శి రాజేష్ కుమార్ పాఠక్ మాట్లాడుతూ.. సమయం చాలా తక్కువగా వుండంతో డ్రోన్ ప్రాజెక్ట్ TDBకి సవాలుగా మారిందన్నారు. అయితే ఇందులో ఉన్న ఆవిష్కరణ , దేశ నిర్మాణానికి అందించే సహకారాన్ని పరిగణనలోకి తీసుకున్నామన్నారు. ప్రాజెక్ట్‌కి సకాలంలో మద్దతు ఇచ్చినందుకు ప్రొ. అశుతోష్ శర్మ, డాక్టర్ నీరజ్ శర్మకి రాజేశ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios