సరిహద్దుల్లో గాల్వన్ లోయ వద్ద చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు వీర మరణం పొందడంతో యావత్ దేశాన్ని కలచివేసింది. చైనాకు గట్టి బుద్ధ చెప్పాలని ముఖ్యంగా ఆ దేశానికి చెందిన ఉత్పత్తులను బహిష్కరించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో చైనా సంస్ధపై దేశంలో మొట్టమొదటి వేటు పడింది. చైనాకు చెందిన బీజింగ్ నేషనల్ రైల్వే రీసెర్చ్ అండ్ డిజైన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ అండ్ కమ్యూనికేషన్ సంస్థకు కేటాయించిన కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తూ భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.

Also Read:కల్నల్ సంతోష్ వీరమరణం.. గాల్వన్ వ్యాలీ.. ఇంతకీ అసలేం జరిగింది?

ఈ మేరకు ఇండియన్ రైల్వేలోని డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డీఎఫ్‌సీసీఐఎల్) ఒక ప్రకటన చేసింది. కాన్పూర్- దీన్ దయాళ్ ఉపాధ్యాయ సెక్షన్ మధ్య ఉన్న 417 కిలోమీటర్ల మేర టెలికమ్యూనికేషన్, సిగ్నలింగ్ ప్రాజెక్ట్‌కు సంబంధించి 2016లో సదరు సంస్థతో ఒప్పందం చేసుకుంది.

దీని విలువ రూ.471 కోట్లు. అగ్రిమెంట్  ప్రకారం చైనా సంస్థ అవసరమైన సాంకేతిక పత్రాలను సమర్పించలేదని, అలాగే ఇంజనీర్లు, ఇతర సిబ్బందిని తమకు కేటాయించలేదని తెలిపింది.

Also Read:చైనా వస్తువులను బహిష్కరించాలి: ప్రజలకు కేంద్ర మంత్రి పాశ్వాన్ పిలుపు

దీనిని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని డీఎఫ్‌సీసీఐఎల్ వెల్లడించింది. కాగా గాల్వాన్ లోయ ఘటన తర్వాత చైనాపై ఆర్ధికపరమైన చర్యలు చేపట్టాలని భారత ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

ఈ మేరకు దాదాపు 100 రకాల చైనా ఉత్పత్తులపై నిషేధం విధించడంతో పాటు, ఆ దేశానికి చెందిన సంస్థలు 5 జీతో పాటు ఎలాంటి ఇతర కాంట్రాక్టులు సొంతం చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని భారత్ భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.