న్యూఢిల్లీ: దేశ సరిహద్దుల్లో చైనా దమనకాండపై చైనా సహా ఇతర దేశాల నుండి చౌకగా, తక్కువ నాణ్యత కలిగిన వస్తువుల దిగుమతులపై నిషేధం విధించేలా నిబంధనలు  మారుస్తామని కేంద్ర ఆహార శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తెలిపారు.

గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. పొరుగు శత్రు దేశాల నుండి  వచ్చే ఉత్పత్తులను నిషేధించాలని సూచించారు.  చైనా వస్తువులను తప్పకుండా నిషేధించాలన్నారు. భారత్ పట్ల శతృత్వంతో వ్యవహరించడాన్ని తేలికగా తీసుకోకూడదన్నారు.

శత్రు దేశాల నుండి వస్తువులు కొనుగోలు చేయాల్సిన  అవసరం భారత ప్రజలకు లేదన్నారు. చైనా దాడుల్లో  ఇండియాకు చెందిన 20 మంది సైనికుల ప్రాణాలు కోల్పోయినట్టుగా ఆయన గుర్తు చేశారు.

ప్రజలు కనీసం చైనా వస్తువులను బహిష్కరించవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే కొత్త నిబంధనలు భారతీయ ప్రమాణాల సంస్థను బలోపేతం చేస్తాయన్నారు. 

ఇండియాకు చెందిన పారిశ్రామిక వేత్తలు పోటీ ధరలతో నాణ్యత కలిగిన వస్తువులను తయారు చేయాలని సూచించారు. వాజ్‌పేయ్ కేబినెట్ లో రక్షణ మంత్రిగా పనిచేసిన జార్జి ఫెర్నాండెజ్ చైనానే ఇండియాకు ప్రథమ శత్రువుగా పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఫెర్నాండెజ్ ఈ వ్యాఖ్యలు చేశారని ఆయన తెలిపారు.