పహల్గామ్ దాడులకు ప్రతీకారంగా భారత ఆర్మీ ఆపరేషన్ సిందూర్ పేరుతో చేపట్టిన ఆపరేషన్‌లో పాకిస్థాన్‌లోని పలు ఉగ్రవాదుల స్థావరాలు ధ్వంసమయ్యాయి. అయితే దీనిపై పాకిస్థాన్ ప్రతిచర్యకు దిగింది. భారత ఆర్మీ ఉగ్రవాదులపై దాడి చేస్తే, పాకిస్థాన్ మాత్రం సామాన్యులను టార్గెట్ చేసుకుంది. అయితే ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరింది.
ఈ నేపథ్యంలోనే భారత ఆర్మీ ఆపరేషన్ సిందూర్ ఎందుకు చేయాల్సి వచ్చిందన్న విషయాలను ఆర్మీ అధికారులు వివరిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా సోమవారం మరోసారి త్రివిధ దళాలకు చెందిన అధికారులు ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ తమ టార్గెట్ పాకిస్థాన్ కాదని, ఉగ్రవాదుల స్థావరాలే తమ లక్ష్యమని తేల్చి చెప్పారు. అలాగని ఉగ్రవాదులకు మద్ధతిచ్చే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలి పెట్టబోమని తేల్చి చెప్పారు.
ఉగ్రవాదులను, వారికి మద్ధతు పలుకుతోన్న వారిని ఏరివేసే దాకా ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని చెప్పారు. దేశంలో ఉగ్రవాదుల దాడి నుంచి రక్షించిన ఎయిరడ్ డిఫెన్స్ సిస్టమ్ వివరాలను వెల్లడించారు. కశ్మీర్, పీఓకేలోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశామని తెలిపారు. ఉగ్రవాదులకు పాక్ మిలిటరీ మద్ధతు తెలపడం సిగ్గుచేటని అన్నారు. చైనా తయారీ ఆయుధాలను పడగొట్టామని ఎయిర్ మార్షల్ ఏకే భారతి మీడియాకు వివరించారు.
భారత డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో) జనరల్ రాజీవ్ ఘాయ్ మాట్లాడుతూ.. అమాయక ప్రజలకు పాక్ దుశ్చర్యకు దిగిందన్నారు. మన ఎయిర్ డిఫెన్స్ బలమైన గోడలా నిలబడిందన్నారు. పహల్గామ్ దాడికి తగిన మూల్యం చెల్లించారని చెప్పుకొచ్చారు.