మోదీ నాకు ప్రాణ స్నేహితుడు.. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికకు ముందు, ఎన్నికైన తర్వాత ట్రంప్ చెప్పిన మాటలు. కానీ మాట మార్చేశారు. స్నేహితుడు అనుకున్న వ్యక్తే మోసం చేశాడు. అయితే దీనికి మోదీ అదిరిపోయే కౌంటర్ ప్లాన్ చేశారు.
మీరు ఎంతో ప్రాణంగా ఇష్టపడ్డ మీ స్నేహితుడు మీతో కలిసి ఆడుకోవడానికి మీకు బొమ్మలు ఇస్తానంటాడు, మీకు తినుబండారాలు ఇస్తానంటాడు. కానీ తీరా కాసేపటికే నేను చెప్పినట్లు వినకపోతే మీతో ఆడుకోవడానికి నిరాకరిస్తాడు. అంతటితో ఆగకుండా మీ దగ్గర ఉన్న స్నాక్స్‌ను కావాలని బలవంత పెడతాడు. ఇదంతా వినడానికి చిన్న పిల్లల గొడవలాగే ఉన్నా ప్రస్తుతం జరుగుతోన్న నిజం ఇదే.
అమెరికా అధ్యక్షుడు భారత ప్రధాని నరేంద్ర మోదీకి చేసింది ఇదే. మోదీ తన స్నేహితుడు అని చెబుతూనే పెద్ద దోకా ఇచ్చారు ట్రంప్. ఎన్నికల్లో గెలిచేంత వరకు ఒక మాట మాట్లాడి గెలవగానే తన వైఖరిని మార్చి, భారత్‌కు ఇబ్బందులు పెట్టడం మొదలు పెట్టారు. అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు భారత్‌పై ఎలాంటి ప్రభావాలు చూపుతున్నాయి.? కానీ మోదీ వాటిని తెలివితో ఎలా తిప్పి కొడుతున్నారు.? లాంటి అంశాలను సరళమైన భాషలో, అందరికీ అర్థమయ్యేలా తెలుసుకుందాం.

హౌడీ మోదీతో మొదలైన బంధం
ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగిన సమయంలో భారత్‌తో అత్యంత సన్నిహితంగా ఉన్నారు. ముఖ్యంగా అమెరికాలో ఉన్న భారతీయుల ఓట్లను ఆకర్షించేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఇదే సమయంలో మోదీని కూడా తన ఎన్నికల ప్రచారానికి ఆహ్వానించారు. ఈ క్రమంలో అమెరికాలో జరిగిన "Howdy Modi", భారత్‌లో జరిగిన "నమస్తే ట్రంప్" వంటి కార్యక్రమాలు ఈ ఇద్దరి మధ్య బంధం గురించి ప్రపంచానికి చాటి చెప్పినట్లైంది. అనుకున్నట్లుగానే ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి చేపట్టాడు. 2024లో ట్రంప్ మళ్లీ అధ్యక్షుడిగా గెలిచిన వెంటనే, ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. నా మిత్రుడికి హృదయపూర్వక అభినందనలు అని రాసుకొచ్చారు.
కొన్ని రోజుల్లోనే బయటపడ్డ అసలు రూపం
దీంతో భారత్, అమెరికాలో మధ్య బంధం బలోపేతం అవుతుందని అంతా భావించారు. ముఖ్యంగా అమెరికాలో ఉంటున్న భారతీయులు ఇక తమకు స్వర్ణయుగమే అని భావించారు. కానీ గెలిచిన కొన్ని రోజుల్లోనే ట్రంప్ అసలు రూపం బయటపడింది. “అమెరికా ఫస్ట్” అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్.. ప్రపంచ దేశాలతో పాటు భారతీయులను కూడా టార్గెట్ చేశారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్నారన్న ఆరోపణలతో భారతీయులకు బేడీలు వేసి మరీ ప్రత్యేక విమానాల్లో ఇండియాకు తరలించడంతో ట్రంప్ టెంపరితనం మొదలైంది.

దెబ్బ మీద దెబ్బ
అమెరికాలో ఉంటున్న భారతీయులపై కఠిన నిర్ణయాలు విధిస్తూ వచ్చిన ట్రంప్.. ఆ తర్వాత టారిఫ్‌ల రూపంలో విరుచుకుపడ్డారు. కొన్ని వస్తువులపై ఏకంగా 50 శాతం సుంకాలు విధించారు. 2024లో భారత్–అమెరికా మధ్య ఎగుమతుల విలువ ₹4.6 లక్షల కోట్ల (అంటే సుమారు $55 బిలియన్)గా ఉంది. ఇప్పుడు ట్రంప్ విధించిన ఈ భారీ పన్నుల వల్ల ఈ వాణిజ్యంలో 40–50% నష్టం వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. దీంతో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులు ఒక్కసారిగా తగ్గిపోయాయి. దీంతో భారత్‌లో తయారీ పరిశ్రమపై ఆధారపడిన వారిపై తీవ్ర ప్రభావం పడింది.

50 శాతం టారిఫ్‌తో జరిగేది ఇదే..
2025 ఆగస్టు 6న ట్రంప్ భారత్‌పై 50% పన్నులు విధించాడు. దీనివల్ల టెక్స్టైల్స్, ఆభరణాలు, ఆటో భాగాలు, సాఫ్ట్‌వేర్ రంగాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. లక్షలాది కార్మికుల ఉపాధిపై ముప్పు ఏర్పడింది. అయితే భారత్ సైతం ట్రంప్ విషయంలో అస్సలు తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తోంది. తమ దేశ రైతులకు, ప్రజలకు నష్టం జరిగే చర్యలకు తాను ఎట్టి పరిస్థితుల్లో సహకరించనని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు.
భారత్‌పై ట్రంప్‌కి ఎందుకంత అక్కసు.?
భారత్‌పై సుంకాలు పెంచడానికి చాలా కారణాలు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా చెబుతోంది.. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాను ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలన్నది ట్రంప్ లక్ష్యం. అందుకే రష్యా నుంచి ఎక్కువ ఇంధనం దిగుమతి చేసుకుంటున్న భారత్‌ను కట్టడి చేయాలని చూశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం వల్ల రష్యాకు నిధులు లభిస్తున్నాయని, ఈ యుద్ధానికి భారత్ సహకరిస్తోందనేది ట్రంప్ వాదన. రష్యాతో వ్యాపారం చేయడం ఆపితేనే సుంకాలు ఆపేస్తామని షరతు పెట్టాడు.

మరో కారణం కూడా ఉంది.
అయితే భారత్‌పై టారిఫ్‌లు పెంచడానికి కేవలం రష్యాతో వ్యాపారం చేయడం ఒక్కటే కారణం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. భారత్‌కు తన డైరీ ఉత్పత్తులను ఎగుమతి చేయాలన్నది ట్రంప్ వ్యూహం. అయితే అమెరికాలో ఆవులకు మేతగా జంతువులు మాంసాన్ని ఇస్తారు. దీంతో ప్రజల సెంటిమెంట్‌ను కారణంగా.. అమెరికా నుంచి పాలు, ఆహార ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి భారత్ సుముఖంగా లేదు. దీంతో అమెరికన్ సంస్థల నుంచి ట్రంప్‌పై ఒత్తిడి పెరిగింది. భారత్‌పై సుంకాలు పెంచడానికి ఇది కూడా ఒక కారణంగా చెప్పొచ్చు.
విస్తరిస్తున్న భారత్ వ్యూహం
అమెరికా టారిఫ్ గేమ్ వేళ.. ప్రధాని మోదీ చైనా పర్యటన ఖరారు కావడం వ్యూహాత్మకంగా భావిస్తున్నారు. రష్యా, చైనా దేశాలతో భారత్ మళ్లీ సన్నిహితంగా చర్చలు ప్రారంభించేందుకు ఇదొక అవకాశంగా మారింది. గతంలో పునాది పడిన Russia-India-China (RIC) కూటమిని పునరుద్ధరించేందుకు అనుకూల వాతావరణం కనిపిస్తోంది. గతంలో గల్వాన్ సంఘటనలతో చైనా-భారత్ సంబంధాలు బలహీనమవడంతో ఈ కూటమి వెనకపడింది. అయితే అమెరికా ఒత్తిడుల మధ్య ఆ మూడు దేశాలు మళ్లీ సమన్వయం సాధించేందుకు ఆస్కారం ఉంది. వెస్ట్రన్ దేశాల ప్రభావానికి ప్రత్యామ్నాయంగా ఈ కూటమి సిద్ధమవుతోందన్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
సూపర్ పవర్‌గా భారత్ ఎదుగుదలకు ఇదే సమయం?
అమెరికా వరుస ఒత్తిడులతో భారత్ దిశ మార్చుకుంటోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ట్రంప్ నైతికత లేకుండా స్వప్రయోజనాలకు కట్టుబడి ఇతర దేశాలపై ఆంక్షలు పెడుతుండటం.. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలను కొత్త మార్గాల కోసం ఆలోచింపజేస్తోంది. చైనా స్వప్రయోజనాల కోసమే ఇతర దేశాలను అప్పుల ఊబిలో నెట్టేస్తోందన్న విమర్శలు ఉన్నా, భారత్ మాత్రం వ్యూహాత్మకంగా, ఆర్థిక భద్రతను, స్వదేశీ ప్రయోజనాలను కాపాడుకుంటూ కొత్త కూటములకు ఊతమిస్తోంది. ఇదే తరహాలో బ్రెజిల్, దక్షిణాఫ్రికా, ఇరాన్ వంటి దేశాలతో సహకారం పెంచుకుంటూ మల్టీపోలార్ వరల్డ్ ఆర్డర్‌కు భారత్ నాయకత్వం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

శక్తివంతంగా బ్రిక్స్
BRICS అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా. 2025లో ఇందులోకి ఈజిప్ట్, ఇరాన్, యుఏఈ, ఇండోనేషియా వంటి దేశాలు కూడా చేరడంతో ఇది మరింత శక్తివంతమైంది. ఇప్పుడీ BRICS బృందం.. ప్రపంచ జనాభాలో 40% ప్రజల్ని కలిగి ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 40% శక్తిని (Purchasing Power ప్రకారం) కలిగి ఉంది. ప్రపంచ చమురు సరఫరాలో సగానికి పైగా నియంత్రణ కలిగి ఉంది. భారత్ ఈ BRICS వేదికను వినియోగించుకుని.. ఆర్థిక మిత్రులు సంపాదించింది, వాణిజ్య భాగస్వాములను పెంచుకుంది, ప్రపంచ స్థాయిలో గౌరవాన్ని పొందింది.
భారత్ తదుపరి అడుగు ఏంటి.?
భారత్ ఎవ్వరితోనూ పోరాటం చేయాలనుకోవడం లేదు. శాంతియుతంగా, స్వతంత్రంగా, తెలివిగా ముందుకెళ్లాలని ఆశిస్తోంది. ఇప్పుడు కొన్ని దేశాలతో రూపాయిలోనే వాణిజ్యం సాగిస్తోంది. ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా దేశాలతో బంధాలను బలోపేతం చేస్తోంది. వాతావరణ మార్పుల చర్చలు, సాంకేతిక వేదికలు, విద్యా మిషన్లలో నాయకత్వం చూపుతోంది.
భారత్ బలాలు ఏంటి.?
భారత్ దగ్గర ఉన్న అతి శక్తివంతమైన ఆయుధం యువత. భారత్ లో సగటు వయస్సు 28 సంవత్సరాలు, అమెరికాలో 38, చైనాలో 39, యూరప్‌లో 43గా ఉంది. అంటే భారత్ లో ఉత్సాహంతో పనిచేయగల, కొత్తది నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న యువత అధికంగా ఉంది. భారత యువత టెక్నాలజీని త్వరగా అంగీకరిస్తుంది. అందుకే భారత్ స్టార్టప్‌లలో, డిజిటల్ చెల్లింపులలో, సాఫ్ట్‌వేర్ అభివృద్ధిలో ప్రపంచానికి మారదర్శకంగా నిలుస్తోంది.
భారత చర్యలతో మనం ఏం నేర్చుకోవాలి.?
* ఎప్పుడూ Plan B సిద్ధంగా ఉంచుకోండి – ఒక్క స్నేహితుడిపై లేదా ఒక్క విషయంపైనే ఆధారపడొద్దు.
* మీ స్వంత నైపుణ్యాలు పెంపొందించుకోండి – భారత్ UPI నిర్మించినట్లు, మీరు కూడా మీ ఆత్మవిశ్వాసం, కావాల్సిన నైపుణ్యాలు తయారు చేసుకోండి.
* వినయంగా కానీ దృఢంగా ఉండండి – దూషణలేకుండా, మీకు న్యాయం కావాలని నమ్మకంగా నిలబడండి.
* నిరంతరం నేర్చుకుంటూ ఉండండి – ప్రపంచంలో ఏం జరుగుతోంది అని తెలుసుకుంటూ ఉండండి.
* ఇతరులతో తెలివిగా కలిసి పనిచేయండి – BRICS దేశాలూ బృందంగా పని చేసినట్టే, మీరు కూడా స్టడీ గ్రూప్‌లు ఏర్పరచండి.
* మీ శక్తి, మీరు ఎంత గొప్పగా అరిచారో కాదు ఎంత స్పష్టంగా ఆలోచించారో అనే విషయంలో ఉంటుంది.
అమెరికా వ్యవహారంతో మనం ఏం నేర్చుకోవచ్చు..?
* ఫేక్ స్మైల్ కాదు, నిజంగానే సాయం చేసే చేతులను నమ్మాలి.
* ఒక స్నేహితుడి మీదే ఆధారపడకుండా, అందరితో స్నేహం చేయాలి.
* ఇతరులపై పూర్తిగా ఆధారపడడం మానుకోవాలి.
* భయపడకండి — భావోద్వేగాలకు బదులుగా బుద్ధిని ఉపయోగించండి.
