Asianet News TeluguAsianet News Telugu

ఐరాస వేదికగా పాక్ పీఎంపై విరుచుకుపడ్డ భారత్.. దావూద్ ఇబ్రహీంను పరోక్షంగా ప్రస్తావిస్తూ అటాక్

ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పై భారత్ తీవ్రంగా విరుచుకుపడింది. 1993 ముంబయి దాడులను ప్రస్తావిస్తూ.. పాకిస్తాన్ శాంతి వచనాలను తిప్పికొట్టింది.
 

india slams pakistan pm at United Nations general assembly meeting citing 1993 mumbai blasts
Author
First Published Sep 24, 2022, 12:54 PM IST

న్యూఢిల్లీ: పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌పై భారత ప్రభుత్వం ఐక్య రాజ్య సమితి వేదికగా విరుచుకుపడింది. 1993 ముంబయి దాడులను ప్రస్తావిస్తూ పాకిస్తాన్‌పై అటాక్ చేసింది. ఐరాస జెనరల్ అసెంబ్లీ సమావేశంలో నిన్న పాకిస్తాన్ ప్రధాని షరీఫ్.. భారత్‌పై  కామెంట్లు చేశాడు. భారత్‌తో శాంతినే కోరుకుంటున్నామని అన్నాడు. జమ్ము కశ్మీర్ అంశాన్నీ లేవనెత్తాడు. దీంతో భారత ప్రభుత్వం నేడు ఘాటుగా స్పందించింది.

ఐరాస భారత మిషన్‌కు కొత్త సెక్రెటరీగా నియామకమైన మిజితో వినితో పాకిస్తాన్ పీఎం షెహబాజ్ షరీఫ్‌పై మాటలతో దాడి చేశారు. కశ్మీర్ అంశంపై పాకిస్తాన్ మాట్లాడినవన్నీ అబద్ధాలే అని, పాకిస్తాన్ సరిహద్దుగా ఉండా ఉగ్రవాదానికి పాల్పడుతున్నదని తీవ్ర ఆరోపణలు చేశారు. 

పాకిస్తాన్ శాంతి అభిలాష వట్టి బూటకమని చెప్పడానికి భారత్ 1993 ముంబయి బాంబ్ బ్లాస్ట్ ఘటనను ప్రస్తావించింది. ఈ దాడులకు కుట్రదారుగా అనుమానిస్తున్న గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీంను భారత్ పరోక్షంగా ఉటంకించింది. భారత్‌తో శాంతియుత సంబంధాలను ఆశించే దేశం దానిపైనే సరిహద్దు గుండా ఉగ్రవాదాన్ని పెంచి పోషించదని భారత్ సూటిగా కామెంట్ చేసింది. అలాగే, ముంబయి దాడుల కుట్రదారులకు ఆశ్రయం కూడా ఇవ్వదని పేర్కొంది. అంతర్జాతీయ సమాజం ఒత్తిడి వల్లే ఆ వ్యక్తి (దావూద్ ఇబ్రహీం!) తమ వద్దే ఉన్నాడని పాకిస్తాన్ వెల్లడించాల్సి వచ్చిందని గుర్తు చేసింది.

శాంతియుత వాతావరణం కోరుకునేది భారత దేశమే అని వినితో పేర్కొన్నారు. పాకిస్తాన్‌తోనూ ఆ సంబంధాలను కోరుకుంటున్నదని, కానీ, అందుకు కొన్ని షరతులు కూడా ఉన్నాయని వివరించారు. తీవ్రవాద రహిత వాతావరణం ఉండాలని, నిర్బంధాలు, హింస, సరిహద్దు గుండా ఉగ్రవాదం ఉండవద్దని కండీషన్స్ పెట్టింది.

అలాగే, పాకిస్తాన్ లేవనెత్తిన జమ్ము కశ్మీర్ అంశానికి స్పష్టమైన సమాధానం ఇచ్చింది. జమ్ము కశ్మీర్ గతంలో భారత దేశ అంతర్భాగంగా ఉన్నదని, వర్తమానంలోనూ ఉన్నదని, భవిష్యత్‌లోనూ భారత అంతర్భాగంగానే జమ్ము కశ్మీర్ ఉంటుందని స్పష్టం చేసింది.

హిందూ, సిఖ్, క్రిస్టియన్ కుటుంబాల నుంచి బాలికలు, యువతుల అపహరణలు, బలవంతపు పెళ్లిళ్లలను పేర్కొంటూ.. మైనార్టీల హక్కులను గంగలో కలిపేస్తూ.. అంతర్జాతీయ వేదికపై శాంతి వచనాలు వల్లించడం, మైనార్టీల హక్కుల గురించి మాట్లాడటం శోచనీయం అని విమర్శించింది.

Follow Us:
Download App:
  • android
  • ios